Leading News Portal in Telugu

BJP’s parody video: బీజేపీ ‘పెళ్లి చూపులు’ పేరడీ వీడియో.. ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం..



Bjp's Parody Video

BJP’s parody video: ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ బీజేపీ చేసిన ఓ వీడియో యాడ్ ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. పెళ్లిచూపులను ఉద్దేశిస్తూ చేసిన ఈ యాడ్‌పై ప్రతిపక్ష కూటమి తీవ్ర అభ్యతరం తెలుపుతోంది. మహిళలను చిన్నచూపు చూసే విధంగా బీజేపీ ప్రకటన ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమాజంలో స్త్రీల విలువలను బీజేపీ తగ్గిస్తోందని మండిపడుతోంది. రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే సహా ప్రతిపక్ష నేతలను యాడ్‌లోని నటులు అనుకరిస్తున్నట్లు ఉంది.

ఓ మహిళ పెళ్లి చూపుల అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ యాడ్‌ని తయారు చేశారు. అయితే, ఇండియా కూటమిలో అనేక మంది లీడర్లు ఉన్న విధంగా, పెళ్లి చూపుల్లో ఎక్కువ మంది వరులు ఉన్నట్లు ఈ యాడ్ చూపిస్తోంది. వరుడు ఎవరనే దానిపై వాదించుకోవడం ఇందులో కనిపిస్తుంది. ఇండియా కూటమిలో కూడా ప్రధాన మంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ జరుగుతున్నట్లు ఈ పేరడీ యాడ్ చూపిస్తోంది.

Read Also: Mood of the Nation: బీజేపీకే జై కొడుతున్న 79 శాతం దేశ ప్రజలు.. తాజా సర్వేలో వెల్లడి..

ఈ ప్రకటన పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే స్పందించారు. పెళ్లి అనేది ఒక పవిత్రమైన కార్యం, ఇది పరస్పర విశ్వాసం, ప్రేమపై ఆధారపడి ఉంటుందని, అయితే బీజేపీ అసభ్యకరంగా దీనిని చిత్రీకరించిందని మండిపడ్డారు. వరుడిని ఎన్నుకోవడానికి, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి చాలా వ్యత్యాసముందని, వరుడు ఎవరైనా కావచ్చు కానీ వైవాహిక ధర్మాన్ని అనుసరించడం ముఖ్యమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. శివసేన(యూబీటీ) నాయకురాలు ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ.. సమాజంలో మహిళల్ని ఎలా చూస్తున్నారనే దానికి బీజేపీ ప్రకటన ఒక ఉదాహరణ అని, ఒక భారతీయ ఓటర్‌ని చూసే పద్ధతి ఇదేనా.? అని ప్రశ్నించారు. ఇది సమాజంలో స్త్రీ పాత్రను తగ్గించడమే అని అన్నారు.