Leading News Portal in Telugu

Nirmala sitharaman: కేజ్రీవాల్ అరెస్ట్‌పై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు



Wal

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అరెస్ట్‌ విషయంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని ఆమె తేల్చారు. ఢిల్లీ మద్యం ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఈ అరెస్ట్‌ను కేంద్రానికి ఆపాదించడం సరైంది కాదని ఆర్థిక మంత్రి మండిపడ్డారు. ఈడీ జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతోనే అరెస్ట్ జరిగిందని తేల్చి చెప్పారు.

ఈడీ సమన్లు జారీ చేసినప్పుడల్లా ఏదో ఒక సాకుతో కేజ్రీవాల్ తప్పించుకుని తిరిగారని తెలిపారు. ఎన్నో సార్లు ఆయా కారణాలు చెప్పి తప్పించుకున్నారని గుర్తుచేశారు. సమన్లకు స్పందించకపోవడంతోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారే తప్ప ఇందులో రాజకీయ దుర్దేశం లేదని పేర్కొన్నారు.

దర్యాప్తు సంస్థల బారి నుంచి తప్పించుకునేందుకే మహారాష్ట్రలో అశోక్ చవాన్, అజిత్ పవార్‌ లాంటి వాళ్లు బీజేపీలో చేరారని ఓ మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు నిర్మల స్పందిస్తూ.. విలువల విషయంలో రాజీ పడబోమని.. బీజేపీలోకి ఎవరినైనా ఆహ్వాస్తామని ఆమె తెలిపారు.

ఇదిలా ఉంటే అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్ విషయంలో ఊరట లభించలేదు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 2లోగా స్పందించాలని ఈడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 3కి విచారణ వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలు జైలులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్‌కి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని వాపోతున్నారు.