Leading News Portal in Telugu

Maharashtra: ఫడ్నవిస్‌తో నవనీత్ కౌర్ దంపతుల భేటీ.. దేనికోసమంటే..!



Mp

మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను అమరావతి ఎంపీ, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నవనీత్ కౌర్ దంపతులు కలిశారు. ఫడ్నవిస్‌ నివాసంలో ఆయనను కలిశారు. బుధవారం విడుదలైన బీజేపీ ఏడో జాబితాలో నవనీత్ ‌కౌర్ పేరును ప్రకటించింది. అమరావతి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నవనీత్ కౌర్ పేరు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫడ్నవిస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 2019 ఎన్నికల్లో నవనీత్ కౌర్.. అమరావతి లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం ఆమె బీజేపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు కమలనాథులు సీటును ప్రకటించారు.

D Cm

నవనీత్ కౌర్.. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా మెరిశారు. అందరికి సుపరిచితమైన నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నవనీత్ భారీ విజయం సాధించారు. పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈసారి బీజేపీ తరుపున ఆమెకే టికెట్ వస్తుందన్న ఊహాగానాలను పార్టీ నిజం చేసింది.

మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వమైన మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) అధికారంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ రాణాతో పాటు ఎమ్మెల్యే రవి రాణాలు పోరాడారు. ముఖ్యంగా ‘హనుమాన్ చాలీసా’ వివాదంతో దేశ రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. వీరిద్దరు ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించడం అప్పుడు సంచలనంగా మారింది. శివసేన కార్యకర్తల బెదిరింపులకు, ప్రభుత్వ బెదిరింపులను తట్టుకుని ఎంవీఏ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని నవనీత్ ఛాలెంజ్ చేశారు. ఈ పరిణామాల తర్వాత నుంచి బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆ పార్టీలో చేరారు.