Leading News Portal in Telugu

Off The Record : డైలమాలో Amanchi బ్రదర్స్ పొలిటికల్ కెరీర్



Amanchi Brother Otr

ఆ పొలిటికల్‌ బ్రదర్స్‌ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఆశించి సీట్లు రాలేదు. అలాగని ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. తాము ఏదో అనుకుంటే… అక్కడ ఇంకేదేదో జరిగిపోయింది. సీట్లు ఆశించిన పార్టీలు ఇవ్వకపోవడంతో స్వతంత్రులుగా బరిలో దిగాలా లేక నచ్చిన అభ్యర్థికి మద్దతివ్వాలా అన్న డైలమాలో ఉన్నారు ఇంతకీ ఎవరా బ్రదర్స్‌? ఏంటా స్టోరీ? బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన అన్న ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు. ఈ బ్రదర్స్‌ పొలిటికల్‌ కెరీర్‌ ఇప్పుడు డైలమాలో పడిందన్న చర్చ ఉమ్మడి ప్రకాశంలో జోరుగా జరుగుతోంది. రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి తమ్ముడు కృష్ణమోహన్‌ వెన్నంటే ఉన్నారు స్వాములు. ఇటీవలి వరకూ వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్నారు కృష్ణమోహన్. ఇప్పుడు ఆ సీటుతో పాటు గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన చీరాల సైతం దక్కకపోవడంతో వాట్‌నెక్స్ట్‌ అన్న ప్రశ్న వస్తోంది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున చీరాలలో పోటీచేసిన ఆమంచి కృష్ణ మోహన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు తన రాజకీయ గురువు కొణిజేటి రోశయ్య సీఎం కావటంతో ఆడింది ఆట పాడింది పాటగా నడిచింది. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి పోటీ చేసి రెండవ సారి గెలిచారాయన. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరి చీరాల అభ్యర్థిగా పోటీచేసి అప్పటి టీడీపీ నేత కరణం బలరాం చేతిలో ఓడారు. అనూహ్య పరిస్దితుల్లో కరణం బలరాం వైసీపీకి మద్దతు తెలపటంతో ఆమంచి హవా తగ్గింది.. ఆ తర్వాత వైసీపీ ఇంచార్జ్ భాద్యతల్ని ఎమ్మెల్యే కుమారుడు కరణం వెంకటేష్ అప్పగించటం.. పార్టీ గెలుపు కోసం ఆమంచిని పర్చూరు వెళ్లాలని అధిష్టానం సూచించటం చకచకా జరిగి పోయాయి.. తప్పనిసరి పరిస్దితుల్లో పర్చూరు ఇంచార్జ్ గా వెళ్లారు కృష్ణమోహన్. కొన్నాళ్లు నెట్టుకొచ్చినా అనూహ్యంగా తాను అక్కడి నుంచి పోటీ చేయనని వైసీపీ అధిష్టానానికి చెప్పటంతో అక్కడ యడం బాలాజీకి బాధ్యతలు అప్పగించింది పార్టీ. చీరాల వైసీపీ టికెట్ కరణం వెంకటేష్ కు రాదని ధీమాగా ఉన్న ఆమంచి.. తాను అనుకున్నది జరక్కపోవడంతో అసంతృప్తిగా ఉన్నారట. కరణం వెంకటేష్‌ను అభ్యర్థిగా ప్రకటించాక తీవ్రంగా రగిలిపోతూ…. సీఎంఓలో ముఖ్య నేతలను కలిశారు. కరణం కుటుంబానికి కాకుండా మరొకరికి చీరాల టిక్కెట్‌ ఇస్తామని చెప్తేనే తాను పర్చూరు వెళ్ళానని, ఇప్పుడు ఇలా చేస్తారా అని అడిగినా అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల ముఖ్య అనుచరులతో రహస్య సమావేశాలు నిర్వహించారట ఆమంచి. తాను చీరాల నుంచే పోటీ చేస్తానని ఫీలర్ ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ను ఓడించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారన్నది ప్రచారం. తాను చీరాల నుంచి మరోసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేయటమా.. లేక టీడీపీ అభ్యర్దికి మద్దతు ప్రకటించి వెంకటేష్‌ను ఓడించటమా.. అన్న డైలమాలో ఉన్నట్టు తెలిసింది.

మరోవైపు ఆమంచి స్వాములు పరిస్దితి కూడా ఇంచుమించు అలానే ఉందట.. జనసేనలో చేరిన ఆమంచి స్వాములు గిద్దలూరు కేంద్రంగా రాజకీయాలు నడపటంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు.. అయితే అనూహ్యంగా ఇటీవల తాను చీరాల నుంచి టీడీపీ, జనసేన అలయన్స్ లో జనసేన అభ్యర్దిగా పోటీలో ఉంటానని బహిరంగంగానే ప్రకటించారు. కానీ… కృష్ణమోహన్‌ పర్చూరు నుంచి చీరాల వైపునకు దృష్టి పెట్టడంతో తిరిగి గిద్దలూరులోనే పోటీ చేస్తానంటూ పాత రాగం పాడారు. కొద్దికాలంగా అన్నదమ్ముల మధ్య గ్యాప్ నడుస్తున్నా తమ్ముడి కోసం చీరాలలో పోటీ చేయబోనని స్పష్టం చేశారు స్వాములు.. అయితే టీడీపీ గిద్దలూరుకు కూడా తమ అభ్యర్దిని ప్రకటించేయటంతో ఫైరవుతున్నారట ఆయన. ఒంగోలులో కాపు సంఘం నేతల సమావేశానికి హాజరైన ఆయన తన వెనక కుట్రలు జరిగి ఉండవచ్చని అన్నారు. అవసరమైతే గిద్దలూరు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పొకొచ్చారాయన. మొత్తం మీద అన్నదమ్ములిద్దరి రాజకీయ భవిష్యత్‌ ఏంటన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకంగానే ఉంది. ఏమాత్రం చిన్న తప్పటడుగు వేసినా రాజకీయ భవిష్యత్తు మొత్తం ప్రశ్నార్దకంగా మారే అవకాశం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట ఆమంచి. మరి బ్రదర్స్‌ ఇద్దరూ ఇండిపెండెంట్స్‌గా బరిలో దిగుతారా? లేక మరో వ్యూహం అమలు చేస్తారా అన్నది చూడాలి.