
ఆ లోక్‌సభ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలిచిన చరిత్ర లేదు. దానికి తోడు ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ పెరిగిపోతోంది. ఇప్పుడా ఫీలింగ్ ఎవరి కొంప ముంచబోతోంది? ఏ పార్టీ అభ్యర్థికి గట్టి దెబ్బపడే సూచనలు కనిపిస్తున్నాయి? అక్కడి బలమైన రాజకీయ కుటుంబాల మద్దతు ఎవరికి ఉంది? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి?ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 2014లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆ తర్వాత 2019లో పౌల్ట్రీ వ్యాపారి రంజిత్ రెడ్డి కారు గుర్తు మీద గెలిచారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలే రెండు వేర్వేరు జాతీయ పార్టీల నుంచి తలపడుతున్నారు. ఇదిలా ఉంటే… నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒకసారి ఎంపీగా గెలుపొందిన వ్యక్తి మరోసారి గెలవలేదు. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందా లేక బ్రేక్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న చేవెళ్ల ఎంపీ నియోజకవర్గంలో…నాలుగు చోట్ల బీఆర్ఎస్, మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ తరపున కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇందులో రంజిత్ రెడ్డి నాన్ లోకల్ కాగా… కాసాని ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి. కొండా లోకల్. దీంతో ప్రస్తుతం చేవెళ్లలో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ బలంగా ఉంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తమ మీద పెత్తనం చేస్తున్నారన్న అసంతృప్తి స్థానిక నేతల్లో బలపడుతోందట. మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్లో ఉండి… ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయని అంటున్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో పౌల్ట్రీ వ్యాపారం చేసుకునే రంజిత్ రెడ్డిని ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి తీసుకువచ్చి ఎంపీ టిక్కెట్ ఇప్పించారు. ఇప్పుడు ఈటల బీజేపీలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా రంజిత్ రెడ్డికి పార్టీలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా…నట్టేట ముంచేసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారని గులాబీ పార్టీ ముఖ్యులే బహిరంగంగా అంటున్నారు. ఇన్నాళ్లు ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ దూరం అయ్యింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నేతలు రంజిత్ రెడ్డిని సొంతం చేసుకోలేని పరిస్థితి. దీంతో ఇటు ఉన్న పార్టీకి దూరమై, అటు కొత్తగా చేరిన పార్టీ కేడర్ మింగిల్ అవక, రంజిత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఉన్నారన్న కారణంతోనే… పట్నం దంపతులు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు రంజిత్ కూడా కాంగ్రెస్ లో చేరిపోవడంతో ఆధిపత్య పోరు తప్పదన్న అంచనాలు పెరుగుతున్నాయి. చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలో మూడు కుటుంబాలదే రాజకీయ ఆధిపత్యం. పటోళ్ల, పట్నం, కొండా కుటుంబాలు మూడు వివిధ పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి. పటోళ్ల ఫ్యామిలీ మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థి కాసానికి మద్దతు ఇస్తుండగా… కొండా ఫ్యామిలీ బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి అండగా ఉంది. ఇక కాంగ్రెస్ పరంగా ఇక్కడ ప్రాబల్యం ఉన్న పట్నం ఫ్యామిలీ మొత్తం సునీతా మహేందర్‌రెడ్డికి మద్దతుగా మల్కాజిగిరికి షిఫ్ట్ అవుతోంది. దీంతో రంజిత్ రెడ్డికి మద్దతుగా నిలిచే బలమైన గ్రూప్ ఒక్కటి కూడా కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. అటు సిట్టింగ్ ఎంపీగా మాకేం చేశారంటూ జనంలో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే… తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఒక్క ప్రశ్న కూడా అడగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట స్థానికులు. తన వ్యాపారానికి సంబంధించిన, తన రాజకీయ అవసరాల కోసమే రంజిత్ రెడ్డికి ఎంపీ పదవి ఉపయోగపడింది తప్పా… చేవెళ్ల ప్రజల కోసం ఏం చేశారన్న ప్రశ్నలు శరపరంపరగా వస్తున్నా…అట్నుంచి సౌండ్ లేదన్నది రాజకీయవర్గాల మాట. రంజిత్ రెడ్డి వల్ల నియోజకవర్గానికి ఈ పని జరిగింది అని చెప్పుకోవడానికి ఒక్క పని కనిపించడం లేదని అంటున్నారట లోకల్ లీడర్స్. దీనికి తోడు చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా రంజిత్ రెడ్డికి సఖ్యత లేకపోవడం మరో మైనస్ అంటున్నారు. కార్యకర్తలతో సత్సంబంధాలు లేకపోవడం ఎంత నష్టం చేస్తుందో ఈ ఎన్నికలతో రంజిత్ రెడ్డికి తెలిసొస్తుందని చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో. మూడు ప్రధాన పార్టీల నుంచి గట్టి పోటీ ఉన్న చేవెళ్ళ ఫలితంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది.