
ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలను చంపేద్దామనుకుంటున్నారా? 3 ఏళ్లుగా రూ.7 వేల 800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలా? విద్యార్థులను రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వ్రుత్తి విద్యా కళాశాలల పరిస్థితి దుర్భరంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఫీజు రీయంబర్స్ మెంట్ట్ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఫీజురీయంబర్స్ మెంట్ నిధులను సక్రమంగా కాలేజీలకు చెల్లించలేదు. నాటి ప్రభుత్వ నిర్వాకంవల్ల అటు కాలేజీ యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. గత మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.7,800 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలు, కళాశాల భవన అద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించలేక గత మూడేళ్లలో వందలాది కాలేజీలు మూతపడ్డాయన్నారు.
గత ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల్లో దాదాపు రూ.750 కోట్లు డిగ్రీ, పీజీ కళాశాలలకు మార్చి నెలాఖరు నాటికి చెల్లిస్తామని పేర్కొంటూ టోకెన్లు జారీ చేసింది. కానీ నేటి వరకు నయా పైసా చెల్లించలేదు. రేపటితో(ఈనెల 31నాటికి) టోకెన్ల గడువు ముగుస్తోంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ద్రుష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందన లేకపోవడం బాధాకరం.
విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తామని, ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను సక్రమంగా చెల్లించడంతోపాటు మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజులైనా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులకు సంబంధించి నయాపైసా చెల్లించలేదు.
సర్కార్ నిర్వాకంవల్ల ముఖ్యంగా సిబ్బంది జీతభత్యాలు, కళాశాలల అద్దెలు, మెయింటెనెన్స్ ఛార్జీల కోసం ఆయా కళాశాలల యాజమాన్యాలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులంతా నిరుపేదలే కావడంతో ఫీజులు చెల్లించలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తే… ప్రైవేటు కాలేజీలను చంపేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్పిస్తోంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసి రోడ్డున పడేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలి. గత ప్రభుత్వం జారీ చేసిన టోకెన్లకు సంబంధించి నిధులను రేపటిలోగా చెల్లించాలి. దీంతోపాటు నిర్దిష్ట గడువులోగా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలన్నీ చెల్లించడంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపుల విషయంలో మరింత మెరుగైన విధానాన్ని అమలు చేయాలని బీజేపీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.