Leading News Portal in Telugu

Volunteers Resign: మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు



Volunteers

Volunteers Resign: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సోమవారం మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు. గ్రామ సచివాలయాల్లోనూ రాజీనామాలు సమర్పించారు వాలంటీర్లు.

Read Also: Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. తెలంగాణలో ఎల్లో అలర్ట్

మచిలీపట్నం నియోజకవర్గంలో 1200 మందికి పైగా వాలంటీర్లు ప్రజలకు సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్నామని, ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు వాపోతున్నారు. గత 50 నెలలుగా నిస్వార్థంగా సేవలందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి రాజకీయాలకు ప్రభావితం కాకుండా విధులు నిర్వహిస్తున్నామని అంటున్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలచివేసిందని తెలిపారు. తమ దగ్గర్నుంచి మొబైల్‌ సిమ్స్‌, డివైస్‌లు తీసేసుకున్నారని చెప్పారు. కొంత మంది తమ సేవలకు రాజకీయాలను ఆపాదించి ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు వాలంటీర్లు. దీంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు ప్రకటించారు.