Leading News Portal in Telugu

Pakistan: హిందూ బాలిక అపహరణ.. సింధ్ వ్యాప్తంగా నిరసనలు..



Pakistan

Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందూ, సిక్కులపై దాడులు ఆగడం లేదు. ముఖ్యంగా హిందూ బాలికల అపహరణ నిత్యకృత్యంగా మారింది. హిందూ బాలికలను, మహిళల్ని అపహరించి ఇస్లాం మతంలోకి మార్చి పెళ్లిళ్ల చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సుల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ప్రావిన్సుల్లోని సుక్కుర్ నగరంలో హిందూ యువతి కిడ్నాప్‌కి గురైంది. ఈ ఘటనపై అక్కడి మైనారిటీలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు.

Read Also: JK Cement: అత్యుత్తమ డీలర్లకు మహీంద్రా XUV 700, స్కార్పియోలను గిఫ్టుగా ఇచ్చి జేకే సిమెంట్..

సింధ్ ప్రావిన్సుతో పాటు బలూచిస్తాన్‌లో ఈ ఘటనపై మైనారిటీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాప్‌కి గురైన యువతిని ప్రియా కుమారిగా గుర్తించారు. డేరా మురాద్ జమాలీలో హిందూ వ్యాపారులు, హిందూ సమాజం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సింధ్ ప్రాంతానికి చెందిన సీనియర్ హిందూ నాయకులు ముఖి మనక్ లాల్, సేథ్ తారా చంద్ మొదలైన మైనారిటీ నేతలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. బాలిక క్షేమంగా తిరిగి వచ్చేలా, మైనారిటీ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సింధ్ సీఎం మురాద్ అలీ షాని కోరారు.

హ్యూమన్ రైట్స్ ఫోకస్ పాకిస్థాన్ (HRFP) కూడా పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న మతపరమైన హింసను తీవ్రంగా ఖండించింది. అన్ని వర్గాలకు సమాన హోదా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరింది. గత కొన్ని నెలలుగా క్రిష్టియన్లు, హిందువుల, అహ్మదీయ ముస్లింలు, సిక్కులు, ఇతర వర్గాలకు చెందిన అనేక మంది ఇలా అపహరణకు గురయ్యారు.