Leading News Portal in Telugu

Ukraine: రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ కీలక నిర్ణయం



Ukrine

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు రెండేళ్లు గడుస్తుంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. భీకరమైన యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ రంగంలోకి యువ రక్తాన్ని నింపాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నిర్బంధ వయసును 27 నుంచి 25కు తగ్గించింది.

రెండేళ్ల నుంచి రష్యాతో ఉక్రెయిన్ పోరాడుతోంది. దీంతో సైనిక, ఆర్థిక నష్టాలను తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కోల్పోయిన సైనిక శక్తిని భర్తీ చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నిర్బంధ వయసును 27 నుంచి 25కు తగ్గించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని అక్కడి పార్లమెంటు గత ఏడాదే ఆమోదించింది. తాజాగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేయడంతో అమల్లోకి వచ్చింది.

5 లక్షల మంది సైనికులను సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు మూడు నెలల క్రితమే జెలెన్‌స్కీ తెలిపారు. ఈ సైనిక సమీకరణ అంశంపై గతేడాది అక్కడి పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే దీనికి ఆమోదం తెలిపేందుకు జెలెన్‌స్కీ ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. అంతేకాకుండా తాజా నిర్ణయం ద్వారా కొత్తగా ఎంతమంది ఉక్రెయిన్‌ సైన్యంలోకి వస్తారనే విషయంపై సైనికాధికారులు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు.

ఉక్రెయిన్‌ రక్షణశాఖ గణాంకాల ప్రకారం.. గత అక్టోబర్‌ నాటికి అక్కడి సైనిక బలం 8 లక్షలు. నేషనల్‌ గార్డ్‌తోపాటు ఇతర యూనిట్లు కలిపి మొత్తంగా అక్కడి భద్రతా దళాల్లో 10లక్షల మంది సైనికులు ఉన్నట్లు అంచనా. రష్యా మాదిరిగానే ఉక్రెయిన్‌ సైనికుల సరాసరి వయసు 40ఏళ్లుగా ఉన్నట్లు అక్కడి రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, యువకులను సైన్యంలోకి తీసుకుంటే అక్కడి మానవ వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన ఉక్రెయిన్‌ వాసుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.