Leading News Portal in Telugu

Delhi: సునీతా కేజ్రీవాల్‌‌ను కలిసిన సంజయ్ సింగ్ దంపతులు



Sue

తీహార్ జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ నేరుగా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. వచ్చి రాగానే సునీతా కేజ్రీవాల్‌‌కు నమస్కరించారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సంజయ్ సింగ్ దంపతులు.. సునీతా కేజ్రీవాల్‌తో సమావేశం అయ్యారు. బుధవారం సాయంత్రమే సంజయ్ సింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు దగ్గర ఆప్ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 6 నెలల పాటు సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. అయితే మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ట్రయిల్ కోర్టుకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక లిక్కర్ కేసులో ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ హైకోర్టులో ఉంది. గురువారం తీర్పు రానుంది.

ఇటీవల జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కూడా సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి భర్తల  అరెస్ట్ పరిణామాలపై చర్చించారు. కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఇండియా కూటమి ఢిల్లీ రాంలీలా మైదానంలో కేజ్రీవాల్‌కు మద్దతుగా మహా ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు.. కేంద్రంపై ధ్వజమెత్తారు.