Leading News Portal in Telugu

Off The Record: నర్సాపురంలో కూటమి అభ్యర్థికి ఓటు ట్రాన్స్‌ఫర్‌ అవ్వడం కష్టమేనా..?



Otr Narsapuram

Off The Record: అనుకున్నదొక్కటి… అయ్యింది ఒక్కటి అని సాంగేసుకుంటున్నారట ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు. నిన్న మొన్నటిదాకా ఆ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఢంకా బజాయించిన వాళ్ళు ఇప్పుడు మెత్తబడ్డట్టు చెప్పుుకుంటున్నారు. గెలిచేదెవరు? ఓడేదెవరన్న అయోమయం సైతం పెరుగుతోందట. ఇంతకీ ఏదా ఎంపీ సీటు? అక్కడ వచ్చిన మార్పేంటి?

నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్.. రాజకీయ చైతన్యంతో పాటు వినూత్న తీర్పులకు కేరాఫ్. అలాంటి చోట ఇప్పుడు కూటమి అభ్యర్థులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయట. ఆర్థికంగా బలమైన, సొంత ఇమేజ్ ఉన్న అభ్యర్ధిని ఎంపీగా పెడతారనురకుంటే… అందుకు విరుద్ధంగా జరిగిందంటూ…అయోమయంలో పడ్డారట ఎమ్మెల్యే అభ్యర్థులు.నరసాపురం ఎంపీ క్యాండిడేట్‌గా శ్రీనివాస వర్మను ఖరారు చేసింది బీజేపీ. ఆ నిర్ణయమే ఎంపీ సీటు పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల అసంతృప్తికి కారణమైందంటున్నారు. ఆర్ధికంగా బలమైన, సొంత ఇమేజ్‌ ఉన్న నాయకుడిని ఎంపీ అభ్యర్థిగా నిలిపితే… అది తమకు కూడా ప్లస్‌ అవుతుందని నిన్న మొన్నటిదాకా ఆశించారట ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌. అందుకు విరుద్ధంగా శ్రీనివాస వర్మ పేరును ప్రకటించడంతో కంగుతిన్నట్టు సమాచారం. ఇమేజ్‌ ఉన్న నేత అయితే తమ మీద భారం ఉండదని భావించినా… అలా జరక్కపోగా ఇప్పుడాయన్ని మేం మోయాల్సి వస్తుందని తెగ బాధపడుతున్నారట కూటమికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యే కేండిడేట్స్‌. బిజెపి తరఫున ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటన తర్వాత… అంతా రహస్య సమావేశం పెట్టుకుని మరీ పరస్పరం గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. శ్రీనివాస వర్మ ఆర్థికంగా బలమైన నేత కాకపోవడం, అంతగా ఇమేజ్‌ ఉన్న నాయకుడు అవకపోవడంతో… తమకు అదనపు భారం వచ్చి పడినట్టుగా ఫీలవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గతంలో అలాంటి అభ్యర్థుల కారణంగా తమ పని తేలికైందని, ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందోనని కంగారు పడుతున్నారట. శ్రీనివాస వర్మ నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సమయంలో కూటమి అభ్యర్థులు ఎవరూ ఆయనకు స్వాగతం పలికేందుకు గాని, అభినందించేందుకు గాని ముందుకు రాలేదు. దీంతో అటు తెలుగుదేశం ఇటు జనసేన తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల్లో బీజేపీ ఎంపీ క్యాండిడేట్‌పై ఉన్న అసంతృప్తి బహిర్గతం అయిందంటున్నారు. కూటమి అభ్యర్థి పేరు ప్రకటించినా ఇప్పటివరకు నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఎంపీ అభ్యర్థితో కలిసిన దాఖలాలు కనబడలేదు. ఈ విషయంలో పునరాలోచన చేస్తే… మంచిదని స్థానిక టీడీపీ నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది. జనసేన నాయకులు కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి నరసాపురం పార్లమెంటు పరిధిలో కూటమిగా మూడు పార్టీలు కలిసి వెళుతున్నా.. ఆర్థిక ఇబ్బందులు, ఇమేజ్‌ కారణాలతో ఎవరి దారి వారిది అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. బిజెపి అభ్యర్థిత్వంపై కూటమి ఎమ్మెల్యే కేండిడేట్స్‌ పైకి కనిపించకున్నా.. లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి దాకా ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చిన నేతలు ఇప్పుడు ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుందా అని డౌట్‌లో పడ్డారట. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ అందర్నీ ఎంతవరకు కలుపుకుని పోతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.