Leading News Portal in Telugu

Kishan Reddy : దొంగలుపోయి గజదొంగలు వచ్చినట్లుంది



Kishanreddy Congress Manifesto

మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వ తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దొంగలుపోయి గజదొంగలు వచ్చినట్లు ఈ రోజు తెలంగాణలో అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగువారమంతా ఏ పని చేసినా పంచాగం చూస్తుంటామని, అలాంటి పంచాంగ పఠనం జరిగే ఈ రోజు మనకు ఎంతో శుభసూచమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు.

తెలంగాణలో ఏమీ మార్పు రాలేదని, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది అంతే అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఆర్జీ ట్యాక్స్ (రాహుల్ గాంధీ) వేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. బిల్డర్లు మొదలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల వరకు అందరూ ఢిల్లీకి వెళ్లి వందల కోట్లు ఇచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మారదని… కుక్క తోక వంకర అన్నట్లుగానే ఉంటుందన్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన.. దేశంలో ఎప్పటికీ మారదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి 2019లో 40 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ 4కు నాలుగు మనమే గెలుస్తున్నామని, కర్ణాటకలోనూ 25 సీట్లు బీజేపీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వద్ద అభివృద్ధిపై అజెండా లేదన్నారు. హామీలు ఎలా నెరవేరుస్తారో తెలియదన్నారు కిషన్ రెడ్డి.