Leading News Portal in Telugu

Bandi Sanjay : రేపటి బండి సంజయ్ “దీక్ష” వాయిదా…



Bandi Sanjay

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో రేపు జరప తలపెట్టిన ‘నేతన్నకు అండగా భరోసా దీక్ష’ కు ప్రభుత్వం దిగివచ్చిందని, ఇది బండి సంజయ్ కుమార్ పోరాటే ఫలితమేనని , నేత కార్మికుల సమస్యలు, డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపినందున, దీక్షా కార్యక్రమాన్ని ఎంపీ బండి సంజయ్ వాయిదా వేస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ నేతన్నల ప్రధాన డిమాండ్లైన బతుకమ్మ చీరెల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతోపాటు సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కొత్త ఆర్డర్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ దీక్షను వాయిదా వేశారని తెలిపారు. నేతన్నల ఇతర డిమాండ్లను సైతం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. నేతన్నలకు, ఆసాములకు మద్దతుగా బండి సంజయ్ వివిధ రూపాల్లో చేసిన పోరాటాలతోపాటు నేతన్నల ఐక్య పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తే పోరాటాల ద్వారానే వాటికి పరిష్కార మార్గాలు సాధ్యమనే విషయం నేతన్న పోరాటాలతో మరోమారు రుజువైందన్నారు. ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ అసాములకు, నేత కార్మికులను భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక అభినందనలుతెలుపుతున్నామన్నారు.భవిష్యత్తులోనూ నేతన్నలకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నేత కార్మికుల ప్రధాన డిమాండ్లను సమస్యలను ,హామీలను నెరవేర్చడంతోపాటు విద్యుత్ బిల్లులపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, 10 శాతం యార్న్ సబ్సిడీని అందించాలన్నారు. అట్లాగే నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని కొనసాగించాలని, అట్లాగే వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణకు, నేతన్నల అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని బీజేపీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేత కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తే ఊరుకునేది లేదని, నేతన్నలకు అండగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో బండి సంజయ్ నేతన్నలకు నిరంతరం వెన్నుదన్నుగా ఉంటారని, అవసరమైతే మరోమారు దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.