
అసెంబ్లీ ఎన్నికల్లోకి ఫ్రషర్గా ఎంటరై మహామహుల్ని మట్టికరిపించిన చరిత్ర ఆ ఎమ్మెల్యేది. కానీ… ఇప్పుడాయనకు అంతకు మించిన అగ్ని పరీక్ష ఎదురవబోతోంది. అప్పుడు కాదు… ఇప్పుడు చూపించు నీ సత్తా అంటూ సవాల్ విసురుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. నీ జెయింట్ కిల్లర్ మేజిక్ ఏంటో చూస్తామంటూ తొడగొడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ విషయంలో ఆయనకు సవాళ్ళు ఎదురవుతున్నాయి? ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా మారిందట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం, మాజీ సీఎంని ఓడించి జైంట్ కిల్లర్ ఇమేజ్ సంపాదించిన రమణారెడ్డికి అదే ఇమేజ్‌తో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించింది బీజేపీ. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జాతీయ నాయకుల దగ్గర వచ్చిన ప్రత్యేత గుర్తింపుతోనే ఆయనకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చారని అంటున్నాయి పార్టీ వర్గాలు. జహీరాబాద్‌లో ఇప్పటిదాకా బీజేపీ గెలిచిన చరిత్ర లేదు. నియోజకవర్గం పరిధిలో పార్టీకి ఓట్ బ్యాంక్ అంతంత మాత్రంగానే ఉందట. ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిని గట్టెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారాయన. మోడీ చరిష్మా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కలిసి వస్తాయని, ఓట్ బ్యాంక్ పెరుగుతుందని ధీమాగా ఉన్నారట కాషాయ నేతలు.
జహీరాబాద్ బీజేపీ టికెట్టును 35 మందిదాకా అభ్యర్ధులు ఆశించారట. వాళ్లందర్నీ కాదని, బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కి టికెట్ ఇచ్చింది బీజేపీ. దీంతో ఆశావహులంతా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. అందుకే వారు పార్టీ అభ్యర్ధితో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారట. ఈ పరిస్థితుల్లో నేతల మధ్య విభేదాలు, ఆధిపత్యపోరు ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి బానాల లక్ష్మారెడ్డి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులందరికీ కలిపినా…లక్షా 72వేల 766 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ… పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కనీసం ఇంకో మూడున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించాల్సిన అవసరం ఉంది. ఇంతటి ప్రతికూల పరిస్దితుల్లో పార్టీ పెద్దలు నమ్ముకున్న జైంట్ కిల్లర్ రమణారెడ్డి విజయం కోసం ఎలాంటి మ్యాజిక్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది నియోజకవర్గంలో. అన్నిటికీ మించి నాయకులను సమన్వయం చేస్తూ… ముందుకు సాగడం ఎమ్మెల్యేకు సిసలైన సవాల్ అంటున్నారు. దీంతో పరిస్థితిని గమనించిన పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్.. పూర్తిగా కాషాయ దళంపైఆధారపడకుండా.. తన సొంత టీంని కూడా రంగంలోకి దింపినట్టు తెలిసింది. అయితే ప్రచార పర్వంలో వాళ్ళ హవా పెరిగి పోవడం పార్టీ సీనియర్స్‌కు నచ్చడం లేదంటున్నారు. ఇన్ని రకాల సమస్యలు, సవాళ్ళ మధ్య బీజేపీ విజయావకాశాలు ఎంతవరకు మెరుగుపడుతున్నాయి? బీబీ పాటిల్ హ్యాట్రిక్ కొడతారా? వంటి చర్చోపచర్చలు జరుగుతున్నాయి జహీరాబాద్‌లో.