Leading News Portal in Telugu

Off The Record : పైకి చెబుతున్నదానికి , ప్రాక్టికల్కు పొంతన లేదా?



Otr Telugu Desam Party

తెలుగుదేశం పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు కంప్లీట్‌గా చల్లారిపోయినట్టేనా? అందరికీ జిందా తిలిస్మాత్‌లాగా… కలిసి పనిచేయండని చంద్రబాబు ఒక్క మాట చెప్పగానే… ఆల్‌ సెట్‌ అయిపోయిందా? పార్టీ పెద్దలు నమ్ముతున్నదేంటి? క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదేంటి? అమరావతిలో ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్ళడం మినహా మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌ అన్న వాదనలో నిజమెంత? ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్స్‌కుగాను 31 నియోజకవర్గాలను పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించింది టీడీపీ. ఇక మరో 30కు పైగా సెగ్మెంట్లల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలుంటారు. ఈ లెక్కన తక్కువలో తక్కువ 60 నుంచి 65 సీట్లలో నేరుగా టీడీపీ కావచ్చు.. లేదా కూటమి అభ్యర్థులు రెబెల్స్‌ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అలాంటి నేతలందర్నీ..లైన్‌లో పెట్టేందుకు కొంత కాలంగా కసరత్తు చేస్తూనే ఉంది టీడీపీ అధినాయకత్వం. అసంతృప్తుల్లో చాలా మంది నేతలకు స్వయంగా సర్ది చెబుతున్నారు చంద్రబాబు. వాళ్ళు కూడా ఆయనతో సరేనంటూ తలూపి బయటికి వచ్చేస్తున్నారు. అదంతా చూస్తున్న పార్టీ పెద్దలు ఆల్‌ ఈజ్‌ వెల్‌. మనం సెట్‌ చేస్తున్నాం… వాళ్ళు సెట్‌ అవుతున్నారు. సమస్యలన్నీ సర్దుకుపోయి అంతా సవ్యంగా ఉంటోంది. ఇక మనకు తిరుగే లేదని లెక్కలేసుకుంటున్నారట. కానీ… వాళ్ళ లెక్కలకు , క్షేత్ర స్థాయి వాస్తవాలకు పొంతన లేకుండా ఉందన్నది పార్టీ వర్గాల మాట. అమరావతిలో తలాడించి వస్తున్న నాయకుల మూడ్‌ నియోజకవర్గానికి వచ్చేసరికి మారిపోతోందట. ఫీల్డులో దిగిన అభ్యర్థులతో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నట్టు తెలిసింది.

దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోని టీడీపీ పెద్దలు అంతా…. సుర్రు సూపర్‌ అన్న భ్రమలో ఉన్నారన్న చర్చ నడుస్తోంది పార్టీలో. సీనియర్ లీడర్స్‌ దేవినేని ఉమ, ఆలపాటి రాజా వంటి వారు వాళ్ల సెగ్మెంట్లల్లో సిన్సియర్‌గా పని చేస్తున్నారా..? అంటే.. లేదనే సమాధానమే వస్తోందట. టిక్కెట్‌ రాకున్నా…దేవినేని ఉమా పార్టీలో యాక్టివ్‌గానే ఉంటున్నారు.. అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ.. అభ్యర్థితో కలిసి ఉమ్మడి ప్రచారం మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. ఇక ఆలపాటి రాజా అయితే నాదెండ్ల మనోహర్‌తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా.. నియోజకర్గంలో ఉండాల్సినంత యాక్టివ్‌గా ఉండటం లేదని పార్టీ కేడర్‌లోనే చర్చ జరుగుతోంది. అటు నిడదవోలు వంటి సెగ్మెంట్లో కూడా జనసేన అభ్యర్థికి టీడీపీ కేడర్ పూర్తిగా సహకరించడం లేదనే చర్చ జరుగుతోందట. ఇటీవలే అనంతపురం, గుంతకల్లు వంటి సెగ్మెంట్లకు చెందిన అసంతృప్తులు చంద్రబాబును కలిసిన సందర్బంలో పార్టీ గెలుపు కోసం పని చేస్తామని చెబుతున్నా… అది ప్రాక్టికల్‌గా ఎంత వరకు అమలవుతుందన్న డౌట్స్‌ అలాగే ఉన్నాయి. అలాగే ఎస్‌ కోటకు చెందిన గొంప కృష్ణ కూడా ప్రస్తుతానికి రాజీపడ్డట్టు కనిపిస్తున్నా… పార్టీ అభ్యర్థికి ఎంతవరకు సహకరిస్తారన్నది డౌటేనంటున్నారు స్థానిక పరిశీలకులు. చంద్రబాబు.. పార్టీ అధినాయకత్వం ఆశిస్తున్నట్టు అంతా రాజీపడి.. పని చేస్తారా అన్న ప్రశ్నకు ఠక్కున అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది టీడీపీలో. ఏ మాత్రం తేడా కొట్టినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం పెరుగుతోందట కొందరు నేతల్లో. అసమ్మతి, అసంతృప్త నేతల మీద నిరంతరం పర్యవేక్షణ పెట్టడం ఒక్కటే పరిష్కారమంటున్నారు. మరి టీడీపీ అధిష్టానం ఈ విషయంలో సీరియస్‌గా ఉంటుందా లేక దేవుడు శాసిస్తాడు, అరుణాచలం ఆచరిస్తాడన్నట్టుగా చంద్రబాబు చెప్పాడు కాబట్టి వాళ్ళు చేసేస్తారని కళ్ళు మూసుకుని కూర్చుంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.