Leading News Portal in Telugu

Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీస్ కేసు.. కారణం ఇదే..



Annamalai

Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలైపై పోలీస్ కేసు నమోదైంది. గత రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చట్టవిరుద్ధంగా సమావేశం, అక్రమ నిర్బంధం, ప్రజలకు ఇబ్బందులు కలిగించిందనుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సెక్షన్లు 143, 341, 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది.

Read Also: Kim Jong Un: కిమ్ రహస్య ప్రేమికురాలు ఈమేనా..? ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా ఉందా..?

డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై అల్లర్లను రెచ్చగొడుతున్నారని, ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నారని ఆరోపించారు. కోయంబత్తూర్ శాంతియుత నగరమని అన్నారు. అహంకారం గురించి తరుచూ మాట్లాడే ప్రధాని మోడీ అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలి అని అన్నారు. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన అన్నామలై తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు తనకు ఉందని, ఏ ఎన్నికల సంఘం మమ్మల్ని ఆపుతుంది, ఆర్డర్ ఎక్కడ ఉంది, మీరు నాకు చూపించాలి..? అని అడిగారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. అన్నామలై గెలుపును అడ్డకునేందుకు డీఎంకే పన్నాగాలు పన్నుతోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. పోలీసులు, కలెక్టర్‌లను దుర్వినియోగం చేస్తూ ఈ కేసులు నమోదు చేశారని అన్నారు. బీజేపీ నుంచి అన్నామలై లోక్‌సభకు పోటీ చేస్తుండటంతో తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సీటు గురించి చర్చ నడుస్తోంది. అధికార డీఎంకే పార్టీ నుంచి గణపతి రాజ్‌కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు తొలివిడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో డీఎంకే, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది.