Leading News Portal in Telugu

Vivek Venkataswamy : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీపాదరావు.



Vivek Venkat Swami

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దివంగత కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నాయకులు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీపాదరావు అని ఆ యన కొనియాడారు. శ్రీపాద రావు ఆశయ సాధనతో పాలన సాగిస్తామన్నారు.

 

రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పది సంవత్సరాలు అధికారంలో ఉండి కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఎక్కడికక్కడ కార్మికులు నిలదీస్తున్నారన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థలు కాపాడిన నాయకులు కాకా వెంకటస్వామి అని, వెంకటస్వామి మనవడిగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించండన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ మాట్లాడుతూ.. సర్పంచ్ స్థాయి నుండి అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగిన గొప్ప నాయకుడు శ్రీపాదరావు అని ఆయన అన్నారు. శ్రీపాదరావు ఆశయ సాధన తో పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.