Leading News Portal in Telugu

Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..



Pm Modi

Electoral Bonds Scheme: లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ‘ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్’పై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఇది సంపూర్ణ మార్గం అని మేము ఎప్పుడూ చెప్పలేదు’’ అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నిజాయతీ తెలిసినప్పుడు ప్రతీ ఒక్కరూ పశ్చాత్తాపపడతారని అన్నారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడం కోసమే ఈ స్కీమ్‌ని తీసుకువచ్చామని, ప్రతిపక్షాలు ఆరోపణలు చేసి పారిపోవాలని అనుకుంటున్నాయని అన్నారు.

Read Also: CPI Ramakrishna: ఒక్క హామీని కూడా బీజేపీ అమలు చేయలేదు.. పెరిగిన ధరలపై ప్రజలు ఆలోచించాలి..!

దర్యాప్తు సంస్థల ద్వారా ఏ 16 కంపెనీలపై విచారణ జరిగింది, ఆ కంపెనీలు ఇచ్చిన విరాళాల్లో బీజేపీకి 37 శాతం రాగా, 63 శాతం బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు వచ్చాయని ప్రధాని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ బిల్లు ఆమోదం పొందినప్పుడు పార్లమెంట్‌లో చర్చ జరిగింది, ఇప్పుడు దీనిని విమర్శిస్తున్న వాళ్లు కూడా ఆ సమయంలో సమర్థించారని ప్రధాని అన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రూ. 1000, రూ. 2000 డినామినేషన్ కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఈ నోట్లను పెద్దఎత్తున తరలించారని.. నల్లధనాన్ని అంతం చేసేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ చెప్పారు.

ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఈ పథకం ద్వారా 3000 కంపెనీలు విరాళాలు ఇచ్చాయని, వీటిలో 26 కంపెనీలు ఈడీ ద్వారా విచారణ ఎదుర్కొంటున్నాయని, వీటిలో 16 కంపెనీలు బీజేపీకి 37 శాతం విరాళాలు ఇస్తే, ప్రతిపక్షాలకు 63 శాతం ఇచ్చాయని ప్రధాని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది మరియు ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని సుప్రీంకోర్ట్ ఎస్‌బీఐని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల డేటాను అప్‌లోడ్ చేసింది. అయితే, ఈ స్కీమ్ ద్వారా బీజేపీ అవినీతికి పాల్పడిందని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తు్న్నాయి.