
AP Elections 2024: ఏపీలో ఇప్పటి వరకు సుమారు రూ. 180 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఏంకే మీనా చెప్పారు. రూ. 22 కోట్ల విలువైన మద్యం, రూ. 31 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 41 కోట్ల మేర విలువైన ఆభరణాలు, పరికరాలు, వస్తువులను పట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, 1017 మందిని తప్పించామని వెల్లడించారు. 86 మంది వాలంటీర్లపై కేసులు నమోదయ్యాయి.
మొత్తంగా ఈ ఎన్నికల్లో 526010 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటుండగా.. పోలింగ్ డ్యూటీలో 3.30 లక్షల మంది నియామకం చేసినట్లు ఎంకే మీనా వెల్లడించారు. బ్రూవరీస్, డిస్టలరీస్ వద్ద వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసనిట్లు, మద్యం స్టోరేజ్ గోడౌన్ల వద్ద, 30 వేల పోలింగ్ స్టేషన్ల వద్ద వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అరకు, రంపచోడవరం, పాడేరు సెగ్మెంట్లల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పాలకొండ, కురుపాం, సాలూరు సెగ్మెంట్లల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. మిగిలిన 169 సెగ్మెంట్లల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు.
Read Also: Namburu Sankara Rao: సిద్ధం పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు..
ఎన్నికల విధుల్లో నిబంధనలు ఉల్లంఘించిన 59 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు , ప్రభుత్వ ఉద్యోగుల ఉల్లంఘనలపై 27 కేసులు నమోదు చేశామని చెప్పారు. 181 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించామని, సీనియర్ అధికారుల మీద ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వంటి వారి నుంచి కూడా వివరణలు తీసుకున్నామని, ఆ వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అన్ని రకాల సమాచారాలను సేకరించి చర్యలు తీసుకుంటుందన్నారు.
సీఎం జగన్పై దాడి విషయంలో సీపీ రాణా వివరణ అడిగామని, ఇవాళ ఓ వ్యక్తిని ఈ కేసులో గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. ముఖ్యనేతల ప్రచారంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. సీఎం జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులకు ఏ తరహా నిబంధనలు వర్తిస్తాయో, సలహాదారులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. ఎన్నికల ఏజెంట్లుగా రాజీనామా చేసిన వాలంటీర్లను నియమించవచ్చా..? లేదా..? అనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి క్లారిటీ తీసుకుంటున్నామన్నారు.