
PM Modi: ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ‘‘ఒక సంవత్సరం, ఒక ప్రధాని’’ సూత్రాన్ని అవలంభిస్తోందని ఆరోపించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఏర్పాట్లు భారతదేశాన్ని అపహాస్యం చేస్తాయని బుధవారం మోడీ అన్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ స్థానం పరిధిలోని హర్దాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలు ఉద్దేశిస్తూ మాట్లాడిన పీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్లలో ఐదుమంది ప్రధానుల ఫార్ములా కోసం ఓటర్లు సిద్ధంగా ఉన్నారా..? అని ప్రజలని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమి ప్రమాదకమైన గేమ్ ఆడుతోందని అన్నారు. నాయకత్వ విషయంలో బీజేపీలో స్పష్టత ఉన్నప్పటికీ.. ఇండియా కూటమిలో స్పష్టత లోపించిందని ఆయన చెప్పారు. ఇండియా కూటమి నేతలు దేశ పగ్గాలు ఎవరికి అప్పగించాలని అనుకుంటున్నారనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో మోడీ అనేది తెలిసిపోయింది, మరి వాళ్ల సంగతేంటి అని ప్రశ్నించారు.
Read Also:The Delhi Files: ది ఢిల్లీ ఫైల్స్ మొదలవుతోంది!
“‘ఒక ఏడాది, ఒక ప్రధాని’ ఫార్ములాపై ఇండియా కూటమిల నేతల మధ్య చర్చ జరుగోతందని మీడియా కథనాలు వచ్చాయని, అంటే ఒక ఏడాది ఒక ప్రధాని, రెండో ఏడాది రెండో ప్రధాని, ఇలా ఐదో ఏడాది ఐదో ప్రధాని, ఇండియా కూటమి ప్రధాని కుర్చీని వేలం వేసే పనిలో నిమగ్నమై ఉంది.” అని ఇండియా కూటమిపై ప్రధాని విరుచుకుపడ్డారు. పగటి కలలు కంటున్న నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు.
మరోవైపు ‘సంపద పునర్విభజన’పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తోందని ఆరోపించారు. రాజకుటుంబం సలహాదారు(శామ్ ప్రిట్రోడా) వారసత్వ పన్ను విధించాలని అంటున్నాడని, ‘‘ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ కార్లు, మోటార్ సైకిళ్ళు లేదా ఇల్లు కలిగి ఉంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది జప్తు చేస్తుంది’’ అని మోడీ అన్నారు.