Leading News Portal in Telugu

Papaiah Madiga : కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మాదిగలు అందరూ కృషి చేస్తారు



Congress

లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాదిగలు అందరూ కృషి చేస్తారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పాపయ్య మాదిగ అన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని… ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటి అయ్యి చర్చించామని పాపయ్య మాదిగ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గానికి నిజంగా అన్యాయం జరిగిందని… పార్లమెంట్ ఎన్నికల తరువాత మాదిగలకు నామినేటెడ్ పోస్టులలో సముచిత స్థానం కల్పిస్తామని హామీని ఇచ్చినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కలిసే అవకాశం ఇవ్వలేదని… తన గోడును ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు.

 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని… దళితుల అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఎస్సి వర్గీకరణపై దటవేత ధోరణి అవలంభిస్తుందన్నారు. ప్రధాని మోదీ కూడా ఎన్నికల సమయంలో మాదిగలకు మభ్యపెట్టేందుకు ఎస్సి వర్గీకరణ పై కేవలం ప్రకటనలు మాత్రమే చేశారని అన్నారు. బిఆర్ఎస్ , బీజేపీ పార్టీలు మాదిగలకు ద్రోహం చేశాయని… రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీలకు గుణపాఠం చెబుతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తాము పాపయ్య మాదిగ స్పష్టం చేశారు.