
నేతన్నలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు,ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వాన్ని సంప్రదించండని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతూ.. ప్రభుత్వం జి.ఓ.నెం.1 లో నేతన్నలకు పాలసి తీసుకువస్తోందని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల కన్నా అధిక ఆర్డర్లు ఇచ్చి అధిక సంపాదన వచ్చేటట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెక్స్టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతన్నల ఉపాధి కొరకు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం చేసిన అప్పులను చక్క దిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. శవ రాజకీయాలను మానుకొని నేతన్నల అభ్యున్నతికి తోడ్పాటుకు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సంవత్సరాలుగా ఎంపీగా ఉండి బండి సంజయ్ చేనేత కార్మికులకు చేసిందేమీ లేదని, ఎక్కడినుండి వచ్చి పోటీ చేసే వారికి ఇక్కడి నేత కార్మికుల గురించి ఏం తెలుసు అని ఆయన అన్నారు. ఎన్నికల అనంతరం పాలసీ ద్వారా నేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇది పూర్తిగా గత ప్రభుత్వం పాపమే ఇలాంటి వారిని పొలిమేర దాటే వరకు కొట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలకు ఇచ్చిన 12000 అంత్యోదయ కార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు పొన్నం ప్రభాకర్.