
గత కొద్ది రోజులుగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. కొద్దిసేపటి క్రితమే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోరి లాల్ శర్మను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ రెండు స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం శుక్రవారమే నామినేషన్‌కు చివరి రోజు. మొత్తానికి కొన్ని గంటల ముందు అభ్యర్థులను ప్రకటించి ఉత్కంఠకు హస్తం పార్టీ తెరదించింది.
మొత్తానికి రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించేసింది. మరికొద్ది సేపట్లో రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు రాయ్‌బరేలీలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. అయితే సోనియా స్థానంలోకి కుమార్తె ప్రియాంక రావొచ్చని వార్తలు వినిపించాయి. కానీ చివరికి రాహులే బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన కేఎల్. శర్మను అమేథీ నుంచి బరిలోకి దించారు.
రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఇక ఈ రెండు స్థానాలకు శుక్రవారమే నామినేషన్‌కు చివరి రోజు. ఈసారి ప్రియాంక రాజకీయాల్లోకి రావొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఈసారి కూడా ఆమె ఎంట్రీ ఇవ్వలేదు. విమర్శలకు భయపడే ఆమె వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గాంధీ కుటుంబం నుంచి ఉభయసభల్లో సోనియా, రాహుల్ ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా బరిలోకి దిగితే.. బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందన్న భావనతోనే ప్రియాంక వెనకడుగు వేసినట్లు సమాచారం. గాంధీ కుటుంబంపై బీజేపీ నుంచి విమర్శలు రాకూడదన్న భావనతోనే ప్రియాంక పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ జరగింది. ఇక మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.