Leading News Portal in Telugu

Pakistan: రాహుల్ గాంధీపై మరోసారి ప్రశంసలు కురిపించిన “పాకిస్తాన్ మాజీ మంత్రి”.. ఈ సారి ఏ అంశంపై అంటే..?



Pakistan

Pakistan: ఎన్నికల సమయంలో పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీని పొగుడుతుండటం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంటే, మరోసారి పాక్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ మరోసారి కాంగ్రెస్ నాయకుడిపై ప్రశంసలు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపద పునర్విభజన సర్వే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే, ఈ హామీని ఫవాద్ హుస్సేన్ కొనియాడారు. రాహుల్ గాంధీని భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పోల్చుతూ.. ఇద్దరూ “సోషలిస్టులే” అని అన్నారు.

కొన్ని రోజుల క్రితం అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్టపై బీజేపీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను ఫవాద్ హుస్సేన్ షేర్ చేసి ‘‘రాహుల్ ఆన్ ఫైర్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వ్యవహారంపై బీజేపీ భగ్గుమంది. కాంగ్రెస్ అంటే పాకిస్తాన్‌కి ఇష్టమని ఆరోపించింది. యువరాజు(రాహుల్ గాంధీని) ప్రధాని చేయడానికి పాకిస్తాన్ తెగ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు.

Read Also: Ponguleti Srinivasa Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే.. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లో చౌదరి ఫవాద్ హుస్సేన్ సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. శనివారం ఆయన రాహుల్ గాంధీని ‘‘రాహుల్ సాహిబ్’’ అని సంభోదిస్తూ ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ తన ముత్తాత జవహర్‌లాల్ (నెహ్రూ) వలె అతనిలో సోషలిస్ట్ ఉన్నాడు. భారత్, పాకిస్తాన్ సమస్యలు దేశ విభజన జరిగిన 75 ఏళ్ల తర్వాత కూడా ఒకే విధంగా ఉన్నాయి, రాహుల్ సాహిబ్ తన చివరి రాత్రి ప్రసంగంలో 30 లేదా 50 కుటుంబాలు భారతదేశ సంపదలో 70 శాతం కలిగి ఉన్నారు అని చెప్పారు. పాకిస్తాన్‌లో కూడా బిజినెస్ క్లబ్ అని పిలువబడే పాకిస్తాన్ బిజినెస్ కౌన్సిల్, కొందరు రియల్ ఎస్టే్ట్ వ్యాపారులు 75 శాతం పాకిస్తాన్ సంపదనను కలిగి ఉన్నారు. సంపద న్యాయమైన పంపిణీ పెట్టుబడీదారు విధానంలో అతిపెద్ద సవాలు’’ అని అన్నారు.

రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విరుచుకుపడ్డారు. అతనికి పాకిస్తాన్‌లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అన్నారు. పాకిస్తాన్‌లో రాహుల్ గాంధీపై నాన్ స్టాప్ ప్రశంసలు కురుస్తున్నాయి. మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ వంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా రాహుల్ గాంధీకి అతిపెద్ద అభిమానే అంటూ ట్వీట్ చేశారు. అతని కుటుంబం గాంధీ కుటుంబం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. అతను రాహుల్ సాహిబ్ అనే పదాన్ని వాడాడు, కాంగ్రెస్ ఇప్పటి వరకు దాన్ని ఖండించలేదు. బీజేపీ ఓడిపోవాలని, కాంగ్రెస్ గెలవాలని పాకిస్తాన్ కోరుకుంటోందని కిరణ్ రిజిజు అన్నారు.