Leading News Portal in Telugu

Revanth Reddy: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి.. బీఆర్ఎస్ చేసిందేమీ లేదు..



Revanth Reddy

2004 నుంచి 2014 వరకు వైఎస్ హయాంలో మంత్రిగా దానం, ఎంపీగా అంజన్ కుమార్ జంట నగరాలను అభివృద్ధి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలు, మెట్రో ను నగరానికి తెచ్చింది కాంగ్రెస్సే అన్నారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించింది తమ పార్టీ అని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మించింది తామే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా మారిందన్నారు. ఔటర్ చుట్టూ భూములు దోచుకోవడం తప్ప నగరానికి బీఆర్ఎస్ చేసిందేం లేదన్నారు. 2021లో నగరంలో వరదలు వస్తే కిషన్ రెడ్డి కనీసం పది రూపాయలు తీసుకురాలేదని ఆరోపించారు. బండి పోయినోళ్లకు బండి ఇస్తానన్న బండి సంజయ్ ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.

READ MORE: KTR: సీఎం రేవంత్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..

జంట నగరాలు మరింత అభివృద్ధి చెందాలంటే దానం నాగేందర్ గెలవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. నాగేందర్ ను గెలిపిస్తే మాణికేశ్వర్ నగర్ లో ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ లో దానంను గెలిపించండి.. కేంద్రంలో ఆయన్ను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించే బాధ్యత తనదన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప అని దుయ్యబట్టారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టండని పిలుపునిచ్చారు. దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపించండని ఓటర్లను కోరారు.

కాగా.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారం జోరు పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు తిరుగుతున్నారు. నియోజకవర్గాల్లోని ప్రధాన పట్టణాల్లో నాయకులు కార్నర్ మీటింగ్ లు పెడుతున్నారు. ఈసారి తప్పకుండా తమ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నాయకులు, కార్యకర్తలకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు.