Leading News Portal in Telugu

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం



Modi

డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ప్రజాగళం సభలో ప్రధాని మాట్లాడారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఆదికవి నన్నయ్య మహాభారతాన్ని వ్రాసిన ఈ గడ్డపై నుంచే కొత్త చరిత్ర మొదలు కాబోతోందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అభివృద్ధిని పరుగులు పెట్టించారని చెప్పారు.

 

Ray

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందన్నారు. ఇండియా కూటమి తరచూ ఈడీని ఎందుకు తిడుతుందో ఈరోజు దేశ ప్రజలకు తెలిసిందని చెప్పారు. జార్ఖండ్‌లో డబ్బు కొండలను ఈడీ తవ్వి తీసిందని వెల్లడించారు. అయినా కాంగ్రెస్ నేతలకు ఇదేమీ కొత్త కాదన్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో గతంలోనూ డబ్బులు దొరికాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే నల్లధనం ఎందుకు దొరుకుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. ఈ నల్లధనాన్ని బయట పెడుతున్నందుకే తనపై ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయినా తాను భయపడనని.. నల్లధనాన్ని పూర్తిగా వెలికితీస్తానని చెప్పుకొచ్చారు. మే 13న ఎన్డీఏ కూటిమికి ఓటు వేసి గెలిపిస్తే.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడతామని మోడీ అన్నారు.

ఏపీలో ఈనెల 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.