Leading News Portal in Telugu

Arani Srinivasulu: కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా..?



Arani Srinivasulu

Arani Srinivasulu: తిరుపతి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీ-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు.. భూమన కరుణాకర రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారని‌ఆరోపించారు.. కాదని కాణిపాకంలో సత్యం చేయడానికి సిద్ధమా? అంటు సవాల్ విసిరారు.. ఇక, కరుణాకర్ రెడ్డి పదేపదే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను విమర్శించడం తగదంటూ హితవుపలికారు.. మరోవైపు… వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తను.. ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకోవడంలో తప్పేమిలేదని‌ అన్నారు. ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించుకోవడం కోసం.. భూమన కరుణాకర్‌రెడ్డి పలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. నేను నాన్ లోకల్ అంటున్న కరుణాకర్ రెడ్డి నాన్ లోకల్ కాదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సుగుణమ్మ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి నాపై అక్రమంగా గెలుపొందారని దుయ్యబట్టారు.. ఇప్పుడు ఎన్నికల్లో కుమారుడిని గెలిపించుకోవడం కోసం పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.

Read Also: Sam Pitroda: దక్షిణాది ప్రజలపై వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా..

ఇక, నేను నాన్ లోకల్ కాదు.. లోకలే అంటూ గతంలోనూ ఆరణి స్పష్టం చేశారు.. 2009లోనే పద్మావతిపురంలో నాకు సొంత ఇళ్లు ఉందన్న ఆయన.. తిరుపతి ప్రజలకు దగ్గరగా ఉంటూనే వచ్చాను.. కానీ, కొంతమంది నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కోవర్టును కాదు.. పవన్ కల్యాణ్‌ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాను.. నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను అని ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేసిన విషయం విదితమే.