
AP High Court: ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్, ఈసీ, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. డీబీటీ పథకాలకు అనుమతి ఇవ్వలేమని కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది ఎన్నికల సంఘం. సుమారు 5 గంటల పాటు వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేశారు.
సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అత్యవసర సేవల్లో ఉన్న కరువు మండలాల్లో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాద వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ జూన్6తో పూర్తవుతుందని ముందుగా ఈసీ జూన్ 6 తర్వాత నగదు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టుకు ఈసీ న్యాయవాది అవినాష్ దేశాయ్ తెలిపారు. తమకు వచ్చిన వినతి పత్రాల పునః పరిశీలన తర్వాత జూన్ 6వ తేదీని పోలింగ్ తేదీ అంటే మే 13 తర్వాత నగదు జమ చేసుకోవచ్చని కోర్టుకు ఈసీ తెలిపింది. పోలింగ్‌కి ముందు ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధమని కోర్టుకు ఈసీ విన్నవించింది. గతంలో ఎన్నికల సమయంలో నగదు జమ, 2019లో పసుపు కుంకుమ డబ్బు జమ వంటి విషయాలను ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.