Leading News Portal in Telugu

Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రామ మందిరాన్ని’’ శుద్ధి చేస్తాం..


Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రామ మందిరాన్ని’’ శుద్ధి చేస్తాం..

Congress: ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అధికారంలోకి రాగానే నలుగురు శంకరాచార్యులచే రామమందిరాన్ని శుద్ధి చేస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌కి విరుద్ధంగా వ్యవహరించారని, ఇండియా కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్దుతుందని నానా పటోలే అన్నారు. ఆలయ నిర్మాణం పూర్తికాలేదని, జనవరి 22న జరిగిన రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాలేదు.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య ఆలయంలో రామ్ దర్బార్ ఏర్పాటు చేస్తామని నానాపటోలే అన్నారు. ‘‘అక్కడ ఉంది రాముడి విగ్రహం కాదు, రామ్ లల్లా విగ్రహం. నరేంద్రమోడీ ఆలయ నిర్మాణంలో ప్రోటోకాల్‌కి విరుద్ధంగా వ్యవహరించారు. మేము దీనిని సరిదిద్దుతాం.’’ అని అన్నారు. నలుగురు శంకరాచార్యులు సరైన ఆచారాలు పాటించలేదని చెప్పారని అన్నారు. సనాతన ధర్మంలో ఎవరి కుటుంబంలో చావు సంభవిస్తే క్షౌరం చేయించుకుంటాము, కానీ ప్రధాని మోడీ అలా చేయలేదని అన్నారు.

నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. హిందువుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పనిచేస్తోందని ఆరోపించారు. ‘‘సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం ద్వారా రాముడి ఉనికిని కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. రామసేతును సవాల్ చేశారు. రాముడు నిజమా కాదా.? అని ప్రశ్నలు అడిగేవారు’’ అని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర అంశాన్ని కాంగ్రెస్ కావాలనే దారి మళ్లించిందని, అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే బీజేపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు.