
Budget 2024: రేపు ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్‌లో కొత్త పెన్షన్ సిస్టమ్, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రత సంబంధిత పథకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు ఉండవచ్చు. అయితే, ఆదాయపు పన్ను విషయంలో కాస్త ఊరట లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం, గ్రామీణ, వ్యవసాయ కేటాయింపుల పెంపు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి గాను వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను, నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం మూడవ టర్న్ మొదటి బడ్జెట్‌ను మంగళవారం, జూలై 23న లోక్‌సభలో సమర్పించనున్నారు.
ప్రఖ్యాత ఆర్థికవేత్త, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపిఎఫ్‌పి) ప్రొఫెసర్ ఎన్‌ఆర్ భానుమూర్తిని బడ్జెట్‌లో సామాజిక భద్రతా పథకాలపై అంచనాల గురించి అడిగినప్పుడు ఎన్‌పిఎస్, ఆయుష్మాన్ భారత్‌పై కొన్ని ప్రకటనలు ఆశిస్తున్నట్లు చెప్పారు. పింఛన్ పథకాలపై రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్‌పీఎస్ (న్యూ పెన్షన్ సిస్టమ్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆయుష్మాన్ భారత్ గురించి ప్రధాని కొన్ని విషయాలు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, 70 ఏళ్లు పైబడిన పౌరులందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ యోజన పరిధిలోకి తీసుకువస్తామని ప్రధాని మోడీ చెప్పారు. మెరుగైన జీవితం, ఉపాధి కల్పించడంపై పార్టీ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. కోవిద్ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యూహంలో సామాజిక భద్రతా పథకాలు ముఖ్యమైనవి. అయితే, ఆరోగ్య రంగంలో బీమా పథకాలు ఈ వ్యవస్థను మరింత ఖరీదైనవిగా చేస్తాయి.