Leading News Portal in Telugu

ఏపీలొ కొత్త పారిశ్రామిక విధానం.. 3పీ కాదు.. 4పీ! | ap new industrial policy| not only ppp| now 4p| cbn


posted on Aug 13, 2024 12:48PM

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే వ్యాపార రంగ నిపుణులు, పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచిన విషయాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసిన కాలమదని చెబుతున్నారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చాయి. క్రియా గ్రౌండ్ అయ్యింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి. అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ రాష్ట్రంలో ఉన్న ఐదేళ్ల కాలం పారిశ్రామికంగా రాష్ట్రానికి చీకటి రోజులుగా పరిశీలకులు చెబుతున్నారు.  ఐదేళ్ల జగన్ అరాచకపాలన అంతం కావడంతో మళ్లీ రాష్ట్రం పారిశ్రామికంగా పునర్వేభవాన్ని సంతరించుకోనుందని చెబుతున్నారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారు చూపుతున్నారు.

నిజమే పరిశ్రమల రంగంలో రాష్ట్రానికి పునర్వేభవాన్ని తెచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తోంది.  రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 20న రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనుంది.   

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా ఈ కొత్త పారిశ్రామిక విధానం ఉండనుంది.  ఇందు కోసం నిబంధనల సరళీకరణ దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.  మూల విధానం నుంచి పక్కకు మరల కుండానే   కీలక రంగాలకు సంబంధించి అనుబంధ పాలసీని ప్రకటించే యోచన చేస్తున్నారు. ఈ మేరకు 2024-29 ముసాయిదా పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సోమవారం (ఆగస్టు 12) సమీక్షించారు. కొత్త పారిశ్రామిక విధానం ఎలా ఉండాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ముసాయిదా పారిశ్రామిక విధానంపై భాగస్వామ్య పక్షాల నుంచీ అభిప్రాయాలు స్వీకరించి.. అందరి ఆమోదంతో ముందుకు సాగాలని భావిస్తున్నారు.  

దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఐదు ఉత్తమ పారిశ్రామిక విధానాలను పరిశీలించి, అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.   2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ  తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు కొత్త పారిశ్రామిక విధానంపై కసరత్తు చేస్తున్నారు.  రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుని పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే  గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని చంద్రబాబు అధికారులతొ సమీక్షలో చెప్పారు. పీపీపీ (4పి) విధానంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కొత్త పారిశ్రామిక విధానంలో ప్రధాన్యత నివ్వాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.  పారిశ్రామిక పార్కులను 4పి విధానంలో ఏర్పాటు చేయడానికి కొత్త పాలసీలో ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.