Leading News Portal in Telugu

Minister Sridhar Babu: మూసీ నది పునర్నిర్మాణం ఒక గ్రీన్ ప్రాజెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తాం..


  • రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీయుల ఉత్సాహం
  • హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌తో పాటు ఇతర కంపెనీలు పెట్టుబడి
  • మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
Minister Sridhar Babu: మూసీ నది పునర్నిర్మాణం ఒక గ్రీన్ ప్రాజెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తాం..

Minister Sridhar Babu: మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీయులు ఉత్సాహం చూపిస్తున్నారని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలా మంది ఆసక్తి చూపెట్టారని వెల్లడించారు. రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ రోజు ఈ అడుగులు వేసి చూపించామన్నారు. కాగ్నిజెంట్‌తో పాటు ఇతర కంపెనీలు కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. వారందరికీ నమ్మకం కల్పించడానికి అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి పర్యటించారని మంత్రి స్పష్టం చేశారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పారిశ్రామిక వేత్తలతో మాట్లాడడం జరిగిందన్నారు.

దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మంచి ఉదాహరణలు తీసుకొని మూసీ నది పునర్నిర్మాణం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మూసీ నది పునర్నిర్మాణం ఒక గ్రీన్ ప్రాజెక్ట్‌గా ముందుకు తీసుకెళ్తామన్నారు. విదేశీ పర్యటన మాకు ఎంకరేజింగ్‌గా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్తామనే నమ్మకాన్ని వారిలో కల్పించామన్నారు. తాము విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు ఎన్ని వేల కోట్లు పెట్టుబడి వస్తాయని ఆలోచించలేదన్నారు. కానీ మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఇదే విధంగా ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు.