Leading News Portal in Telugu

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట | ap high court order not to arrest vamshi| 20th


posted on Aug 14, 2024 5:10PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ లో  ఊరట లభించింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని అరెస్టుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో గత కొంత కాలంగా వల్లభనేని వంశీ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. దీంతో వంశీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి వంశీ సన్నిహిత అనుచరుడితో సహా 18 మందిని అరెస్టు చేశారు. వంశీ అరెస్టు లక్ష్యంగా మూడు పోలీసు బృందాలు హైదరాబాద్ లో కూడా గాలించాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ పేరు 71వ ముద్దాయిగా ఉంది. ఈ దాడిలో వంశీ నేరుగా పాల్గొనపోయినా దాడికి వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించింది వంశీయేనని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం పోలీసులు వంశీ సొంత మనుషుల్లా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇలా ఉండగా వంశీ అమెరికా చెక్కేశారనీ, కాదు కాదు దేశంలోనే ఉన్నారని పలు వార్తలు వినవస్తున్నాయి. వంశీ కోసం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టును తప్పించుకోవడం సాధ్యం కాదని భావించిన వంశీ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పైబుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 20 వరకూ వంశీపై ఎలాంటి చర్యా తీసుకోవద్దని, అదే విధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.