Leading News Portal in Telugu

Vinesh Phogat Weight: వినేశ్‌ ఫొగాట్‌ బరువు పెరగడానికి ఆ మూడే కారణమా?


  • వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు
  • 100 గ్రాముల అధిక బరువు
  • ఆ మూడే కారణమా?
Vinesh Phogat Weight: వినేశ్‌ ఫొగాట్‌ బరువు పెరగడానికి ఆ మూడే కారణమా?

Vinesh Phogat Weight Gain Reasons: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌ 2024లో రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. వంద గ్రాముల అధిక బరువు ఉండటంతో వినేశ్‌ వేటుకు గురైంది. సెమీ ఫైనల్‌ తర్వాత 49.9 కేజీలు మాత్రమే ఉన్న వినేశ్‌.. ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా 52.7 కేజీలకు పెరిగింది. ఫైనల్‌కు ముందు తీవ్రంగా శ్రమించినా.. 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. బరువు పెరగడానికి మూడు అంశాలే ప్రధాన కారణం అని తెలుస్తోంది.

ఫైనల్‌కు ముందు వినేశ్‌ ఫొగాట్‌ గ్లాస్ పళ్ల రసం, ఫ్లూయిడ్స్‌, స్నాక్స్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటి కారణంగానే వినేశ్‌ బరువు ఒక్కసారిగా పెరిగిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం… సెమీస్ సందర్భంగా 300 గ్రాముల జ్యూస్‌ను తాగింది. బౌట్స్‌కు ముందు ఉత్సాహంగా ఉండేందుకు కొన్ని లీటర్ల ఫ్లూయిడ్స్ తీసుకుంది. దాంతో 2 కేజీల బరువు పెరిగింది. సెమీస్‌ ముగిశాక స్నాక్స్‌ తీసుకుంది. దాంతో ఆమె బరువు మూడు కిలోలు అదనంగా పెరిగింది. సెమీస్‌కు ముందు 49.9 కిలోలు ఉన్న వినేశ్‌.. ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా 52.7 కిలోలకు పెరిగింది.

అధికంగా ఉన్న వెయిట్‌ను తగ్గించుకొనేందుకు వినేశ్‌ ఫొగాట్‌ బాగా కష్టపడింది. ట్రెడ్‌మిల్‌పై దాదాపు 6 గంటల పాటు శ్రమించింది. సౌనా బాత్ మూడు గంటలు చేసింది. జిమ్, ఇతర వ్యాయామాలు కూడా చేసింది. ఈ సమయంలో ఆమె ఒక్క చుక్క నీరు కూడా తీసుకోలేదు. అంతేకాదు ఆమె దుస్తులకు ఉన్న ఎలాస్టిక్‌ను తీసేయడంతో పాటు జుట్టును కూడా కత్తిరించారు. అయినా కూడా 100 గ్రాముల అధిక బరువు ఉంది. సాధారణంగా 53 కేజీల విభాగంలో పోటీ పడే వినేష్.. ఈ ఒలింపిక్స్‌లో మాత్రం 50 కేజీల కేటగిరీలోకి మారింది. దీంతో అదనంగా మూడు కేజీలను తగ్గడం సాధారణ విషయం కాదు.