Leading News Portal in Telugu

పేదలకు పట్టెడన్నంపై రాజకీయమా..! ఛీ.. మీ బతుకు చెడ! | ycp politics on anna canteens| people| angry| caution| jagan| party| disappear


posted on Aug 16, 2024 7:14AM

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తోంది. మరోవైపు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలకు అండగా నిలుస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తోంది. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పేదలకు రూ. 5కే నాణ్యమైన భోజనం అందించే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పూటకు రూ.5 చొప్పున రోజుకు రూ. 15కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు దంపతులు తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆడంబరాలు, పెళ్లి ఖర్చులు తగ్గించుకొని అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళాలివ్వండి.. సేవాభావంతో దాతలు ముందుకు రండి అని ప్రజలకు పిలుపు ఇచ్చారు. 

2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారి దివంతగ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభించారు. దీంతో వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చిన పల్లె వాసులుకు, పట్టణంలో వివిధ పనుల చేసుకుంటూ జీవనం సాగించే పేదలకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. రోజుకు వేలాది మంది అన్న క్యాంటీన్ల ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన అల్పాహారం, భోజనంతో కడుపు నింపుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అన్న క్యాంటీన్లు మంచిపేరు తీసుకొచ్చాయి. చంద్రబాబు మంచి ఆలోచన పట్ల పేద, మధ్య తరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 2019లో  తెలుగుదేశం అధికారం కోల్పోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చీ రాగానే జగన్ మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లపై కుట్రపూరితంగా వ్యవహరించారు. పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందించే క్యాంటీన్లపైనా తన ప్రతాపం చూపాడు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను పూర్తిగా తొలగించేశాడు.

దీంతో జగన్ నిర్ణయంపై తెలుగుదేశం శ్రేణులే కాదు, పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పలు ప్రాంతాల్లో తెలుగుదేశం నేతలే సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లు నిర్వహించారు. వాటిపైనా వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. సొంత ఖర్చులతోనైనా అన్న క్యాంటీన్లు నిర్వహించడానికి వీళ్లేదని వాటిని బంద్ చేయించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా వంద అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది.

 కూటమి ప్రభుత్వంలో పున: ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సతీమణి నారా భువనేశ్వరి  రూ. కోటి విరాళం ప్రకటించారు. స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస రాజు రూ. కోటి విరాళం ప్రకటించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కృష్ణా జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కలిపి రూ. 50లక్షలు విరాళం ప్రకటించారు. టీడీపీ యువనేత దండమూడి చౌదరి రూ.5,07,779లు విరాళం అందజేశారు. ఏటా ఆగస్టులో ఈ మొత్తాన్ని ఐదేళ్ల పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. వీరితో పాటు దేశ, విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వ్యాపారులు అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నేతలు సైతం అన్న క్యాంటీన్లకు తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు సన్నద్ధమయ్యారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అధికారం కోల్పోయి 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఎప్పుడూ కుక్కతోక వంకరే అన్నట్లుగా అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా మేము పేదలకు మంచి చేయడానికి వ్యతిరేకం అన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అన్న క్యాంటీన్లపై వైసీపీ నేత అంబటి రాంబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టడంతో పాటు చంద్రబాబు చేసిన సూపర్‌ సిక్స్‌ వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్న క్యాంటీన్ల పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారంటూ అంబటి వ్యాఖ్యానించడం వైసీపీ నేతల నీచ బుద్ధిని తెలియజేస్తోంది. అంతేకాదు.. కేవలం పబ్లిసిటీ కోసమే అన్న క్యాంటీన్లు పెడుతున్నారని వైసీపీ నేతలు అనడంతో వీరు అసలు ప్రజా ప్రతినిధులేనా అని ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 వైసీపీ   హయాంలో అన్న క్యాంటీన్లు మూసేసి జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ అన్న క్యాంటీన్లు ప్రారంభించి ప్రజలకు పట్టెడన్న పెడుతుంటే వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అన్న క్యాంటీన్ల రంగుపైనా వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం చూస్తుంటే వీళ్లను ఎంత త్వరగా తరిమి కొడితే రాష్ట్రం అంత త్వరగా బాగుపడుతుందని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి అన్న క్యాంటీన్లకు పసుపు రంగుతోపాటు, ఎరుపు రంగు, బూడిద రంగు, వైట్ కలర్ ఇలా ఐదు రంగులు ఉన్నాయి.   దీనిని కూడా వైసీపీ నేతలు రద్దాంతం చేయాలని చూస్తూ జనం చేత ఛీకొట్టించుకుంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో పంచాయతీ భవనాలకు పూర్తిగా వైసీపీ రంగులు వేశారు.  అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు కోర్టుకు వెళ్లడంతో.. వైసీపీ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు పెట్టింది. దీంతో వైసీపీ కలర్ తోపాటు మూడు రంగులు వేశారు. కానీ తెలుగుదేశం  కోర్టు సూచనలను పాటిస్తూ   అన్న క్యాంటీన్ భవనాలకు ఐదు రంగులు వేసింది. కానీ, వైసీపీ నేతలు మాత్రం క్యాంటీన్ భవనాలకు ఎల్లో కలర్ ఎక్కువగా వేశారంటూ వాదన చేయడం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్న సమయంలో పేద వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నేతలు.. కూటమి ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంటే విమర్శలు చేస్తుండటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇలానే వ్యవహరిస్తే రాబోయే కాలంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని పేద, బడుగు వర్గాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.