Leading News Portal in Telugu

మాచర్లలో వైసీపీ మటాష్! | ycp loose macharla municipality| 14 Councilors| join| tdp| chairman| vice


posted on Aug 16, 2024 3:51PM

మాచర్లలో వైసీపీ ఆధిపత్యం దాదాపు కనుమరుగైపోయింది. ఈ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా వైసీపీ పట్టు బిగించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటూ 2009 నుంచి మాచర్ల ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన వైసీపీ సీనియర్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఉక్కు పిడికిలిలో నలిగిపోయింది. నియోజకవర్గంలో పిన్నెల్లి ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా ఆయన పెత్తనం చెలాయించారు. ఇందుకు తెలుగుదేశంలో నాయకత్వ లోపం, గ్రూపు తగాదాలూ కూడా ప్రధాన కారణం.

కారణాలేమైతేనేం.. జగన్ హయాంలో పిన్నెళ్లి ఆగడాలు పెచ్చరిల్లాయి. 2022లో జరిగగిన మునిసిపల్ ఎన్నికలలో పిన్నెళ్లి దౌర్జన్యపూరితంగా వ్యవహరించి, బెదరింపులకు తెగపడి ప్రతిపక్ష నుంచి ఎవరూ పోటీలో లేకుండా చేశారు. దీంతో  మాచర్ల మునిసిపాలిటిలోని 31 వార్డులలోనూ వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాచర్లలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భయం గుప్పెట నుంచి బయటపడిన జనం ధైర్యంగా వైసీపీని ఎదిరిస్తున్నారు. అదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గంపై పట్టు బిగించారు.

అన్నిటికీ మించి తన దౌర్జన్యాలు, దాష్టీకాలతో నియోజకర్గాన్ని తన ఉక్కుపిడికిలిలో బంధించిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో జైలులో ఉన్నారు. పిన్నెళ్లి దౌర్జన్యాలపై జనం తిరుగుబాటుకు, నిశ్శబ్ద విప్లవానికి నిదర్శనంగా ఆయన 33 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో మాచర్ల మునిసిపాలిటీలో కూడా వైసీపీ బలం కోల్పోయింది. ఈ పార్టీకి చెందిన  మునిసిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం గూటికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు జూలకంటి సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీగా ఉన్నారు. అది జరిగిన వెంటనే మునిసిపాలిటీ  తెలుగుదేశం  కైవశం అవుతుంది.