
శాఖ సమీక్షలు, జిల్లా పర్యటనలు, అధికార కార్యక్రమాలు, సమావేశాలు, సభలు, అభివృద్ధి పనుల పరిశీలన, ప్రజా సేవ, సందర్శకుల సమస్యల పరిష్కారం, పార్టీ ప్రోగ్రాముల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి సీతక్క నిత్య విద్యార్థిగా నిలుస్తున్నారు. సారం లేని భూమి చదువు లేని జీవితం ఒక్కటే అని బలంగా నమ్మే సీతక్క..అధ్యయనం పోరాటం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. అధికార బాధ్యతలు నిర్వర్తిస్తూనే చదువుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజా సేవలోనే ఉంటూ ఎల్ఎల్బి, రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన సీతక్క తాజాగా నేటి నుంచి ప్రారంభమవుతున్న ఎల్.ఎల్.ఎమ్ రెండో సంవత్సర పరీక్షలకు హాజరవుతున్నారు. తన అధికార నివాసమైన ప్రజాభవన్లో ఎల్.ఎల్. ఏం పుస్తకాలను చదువుతున్నారు. అడవి నుంచి అధికారం వరకు ఆదివాసీ పల్లెల నుంచి పీహెచ్డీ వరకు ఆమె ప్రస్తానంలో ఎన్నో మలుపులు, మరెన్నో కష్టాలు. ప్రజల కోసం ప్రజల పక్షాన అడవి బాట పట్టిన ఒకప్పటి సీతక్క ఇప్పుడు ఆ అడవి బిడ్డల ఆశలకు, వారి అభివృద్ధికి వారధి. ఆమెది చిన్నపటి నుంచి తమ ఉద్యమ ప్రభావిత ప్రాంతం. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చిన గుత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యలపై పీహెచ్డీ చేశారు.