
బీఆర్ఎస్లో… పార్టీ అధిష్టానం పెట్టే రూల్స్ కొందరికేనా? టాప్ టు బాటమ్ అందరికీ అవే రూల్స్ వర్తించవా? ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదా? కొందరు పెద్దలకు విచ్చలవిడి మినహాయింపులు ఉంటాయా? వాళ్ళు ఏమనుకుంటే అది మాట్లాడేయవచ్చా? పార్టీలో కొత్తగా ఇప్పుడీ చర్చ ఎందుకు జరుగుతోంది? ఏ విషయంలో రచ్చ మొదలైంది? మహాలక్ష్మి….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్న హామీ మేరకు పవర్లోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. ఈ పథకాన్ని నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లైట్ తీసుకోవడమేగాకుండా… అది అసలు సాధ్యంకాని హామీ అని, అమలు చేయలేరని చెప్పింది. కానీ… ప్రస్తుతం అమల్లోకి వచ్చిన నాటి నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది ప్రోగ్రాం. అయినా బీఆర్ఎస్ వైఖరి మాత్రం అలాగే కొనసాగుతోంది. దానివల్ల ఆటో డ్రైవర్స్ ఉపాధికి గండి పడుతోందని, వాళ్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్న వాదన సైతం తెర మీదికి వచ్చింది. కానీ… అవేవీ పథకం అమలు మీద ప్రభావం చూపలేకపోయాయి.
మరోవైపు సోషల్ మీడియాలో సైతం రకరకాలుగా ట్రోలింగ్ నడుస్తోంది. మహిళలు పనిలేక ఉచిత బస్సులు ఎక్కుతున్నారని, బస్సులోనే వెల్లుల్లి తొక్కలు తీసుకోవడం, కూరగాయలు అమ్ముకోవడం లాంటి వీడియోలతో హోరెత్తి పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దీనిపై చర్చకు దారితీశాయి. పైగా ఆయన అన్న మాటలతో పార్టీ ఇరుకున పడుతోందన్న వాదన సైతం బలపడుతోందట. ఆటోడ్రైవర్స్కు అన్యాయం పేరుతో తాము చేస్తున్న రాజకీయంతో మహిళల్లో వ్యతిరేకత వస్తోందని గ్రహించిన బీఆర్ఎస్… ఉచిత బస్సు ప్రయాణం మీద ఇక ఎవరూ మాట్లాడవద్దని ఇంటర్నల్గా చెప్పేసిందట. అప్పటి నుంచి పార్టీ నాయకులు ఆ విషయంలో సంయమనం పాటిస్తున్నారు. కానీ.. ఆ విషయమై తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్… మంత్రి సీతక్కను విమర్శించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మహిళలు ఉచిత బస్సుల్లో కూర్చుని కుట్లు అల్లికలేం ఖర్మ… బ్రేక్ డాన్స్లు కూడా చేసుకోవచ్చునని అన్నారు కేటీఆర్. ఆ బ్రేక్ డ్యాన్స్ మాటల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోందట మహిళల్లో. మాజీ మంత్రి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని, ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలంటే ఆయనకు అంత చిన్నాచూపా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించింది. మాజీ మంత్రి వ్యాఖ్యల మీద విచారణ చేపడతామని ప్రకటించింది. దాంతో పరిస్థితి చేయిదాటి పోతోందని, అది ఎట్నుంచి ఎటో పోతోందని గ్రహించిన కేటీఆర్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్తునట్లు ట్వీట్ చేశారు. సరే… ఆ సారీతో వ్యవహారం సద్దుమణుగుతుందా? లేక పొలిటికల్ కలర్ పులుముకుని ఇంకా రచ్చ అవుతుందా అన్న సంగతి పక్కనబెడితే…. బీఆర్ఎస్లో అంతర్గతంగా కొత్త చర్చ మొదలైందట. పరిస్థితి తీవ్రతను గమనించి మహాలక్ష్మి పథకంపై ఎవ్వరూ నెగెటివ్ కామెంట్స్ చేయవద్దని, ఆ విషయంలో బహిరంగ వ్యాఖ్యలకు తావులేదని మాకు నిర్దేశించిన పార్టీ పెద్దలు తామే లైన్ దాటడమేంటన్న చర్చ జరుగుతోందట కేడర్లో. పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాక మేం ఎవ్వరం మాట్లాడటం లేదు. కానీ… సాక్షాత్తు వర్కింగ్ ప్రెసిడెంటే మళ్లీ తేనెతుట్టెను కదిపి సారీ చెప్పేదాకా తెచ్చుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారట పార్టీ నాయకులు. ఇంత సున్నితమైన అంశంలో ఒక్కసారి నోరు జారితే జరిగే డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పార్టీ వర్గాల్లో. మన ప్రభుత్వంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించక పోయినా నష్టం లేదుగానీ… వేరే ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇలాంటి పథకం విషయంలో తేడాగా మాట్లాడితే ఊహించని నష్టం కనిపించకుండా జరిగిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట బీఆర్ఎస్ శ్రేణుల్లో. మరి కేటీఆర్ రేపిన వివాదం ఇక్కడితో సమసిపోతుందా? లేక పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.