- కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన
- స్పందించిన సౌరవ్ గంగూలీ
- దాదాపై నటి శ్రీలేఖ మిత్రా ఆగ్రహం

Sreelekha Mitra On Sourav Ganguly: ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని దాదా డిమాండ్ చేశారు. అయితే ఈ ఒక్క ఘటనతో కోల్‌కతా, వెస్ట్ బెంగాల్ సురక్షితంగా లేదనే వాదన సరికాదన్న దాదాపై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ… ‘ఇది దురదృష్టకరమైన ఘటన. దోషులను కఠినంగా శిక్షించాలి. ఇది అత్యంత క్రూరమైన చర్య. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరగవచ్చు. ఈ ఒక్క ఘటనతో దేశంలో భద్రత లేదనే వాదన సరికాదు. భారత్ అద్భుతమైన దేశం. వెస్ట్ బెంగాల్ సహా అన్ని రాష్ట్రాల్లో భద్రత కఠినంగా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అమ్మాయిల రక్షణకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి’ అని అన్నారు.
సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గంగూలీ.. మీ వాఖ్యలు చాలా బాధకరంగా ఉన్నాయి. ప్రజలు మిమ్మల్ని, మీ తాతను, మీ క్రికెట్‌ని, మీ టీవీ షోను నెత్తిన పెట్టుకున్నందుకు.. మహారాజాగా మిమ్మల్ని పిలుచుకున్నందుకు మాకు బాగా బుద్ది చెప్పారు. అత్యంత క్రూరమైన ఘటనను ఓ సాధారణ సంఘటన అని ఎలా అన్నారు?’ అని శ్రీలేఖ ఫైర్ అయ్యారు. శ్రీలేఖ వ్యాఖ్యలపై దాదా స్పందించారు. తన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకున్నారో తెలియడం లేదన్నారు. నేరస్థులకు కఠినమైన శిక్ష విధించాలని తాను డిమాండ్ చేశానని, మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదని కోరుకున్నానన్నారు.