- విశాఖలో సంచలనం రేపుతున్న చైల్డ్ రాకెట్..
-
ఆస్పత్రుల్లోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే నిందితులపై పోలీసుల నజర్.. -
ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశాం: విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్. బాగ్చీ

Child Trafficking: విశాఖపట్నంలో చైల్డ్ రాకెట్ సంచలనంగా మారుతుంది. ఆసుపత్రుల్లోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి లక్షల రూపాయలకు అమ్మేస్తున్నాయి ఘరానా ముఠాలు. కొన్ని కేసుల్లో బంధువులు, తల్లిదండ్రులు భాగస్వామ్యంగా ఉండటంతో మరింత కలవర పాటుకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం సిరిపురం ఏరియాలో చిన్నారిని అమ్మకానికి పెట్టినట్టు టాస్క్ ఫోర్స్ కు సమాచారం వచ్చింది. దీని ఆధారంగా రైడ్ చేస్తే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. సుమారు 8 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నట్టు గుర్తించారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మరో శిశువును అమ్మకానికి పెట్టిన సమాచారంతో రెస్క్యూ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలను కాపాడగా.. 10 మంది అరెస్ట్ అయ్యారు అని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చీ పేర్కొన్నారు.
అలాగే, శిశు మాఫియా మూలాలను కనిపెట్టేందుకు ప్రత్యే క బృందాలను రంగంలోకి దించారు సిటీ పోలీసు కమిషనర్ బాగ్చీ. అంతర్ రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు ఒడిశా, కడప, అనకాపల్లి వంటి ప్రాంతాలకు టీంలు వెళ్ళాయి.. వరుస ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.. కేజీహెచ్, ఘోషా ఆసుపత్రి సహా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర నిఘా పెంచారు అని ఆయన చెప్పుకొచ్చారు. సిటీ పరిధిలోని 80 ఆసుపత్రులలో లోపాలను గుర్తించాం.. తల్లీ, బిడ్డల రక్షణకు అవసరమైన ఏర్పాట్లలో వైఫల్యాలను సరిదిద్దాలని, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదని నిర్ధారణ అయింది అన్నారు. చైల్డ్ మిస్సింగ్ కేసులతో పాటు వివిధ ఆసుపత్రుల నుంచి అపహరణకు గురైన వాటిని మొత్తం క్రోడీకరించి ఒక లాజికల్ కన్ క్ల్యూజన్ కు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చీ వెల్లడించారు.