- అధికారులతో మంత్రి సవిత సమావేశం
- కొత్త టెక్స్‌టైల్ పాలసీపై చర్చ

Minister Savitha: అధికారులతో ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త టెక్స్‌టైల్ పాలసీపై చర్చించారు. త్వరలో నూతన ఏపీ టెక్స్ టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా టెక్స్‌టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఇందుకోసం మౌలిక వసతుల కల్పనతో పాటు రాయితీలు కూడా విరివిరిగా అందజేస్తామని ఆమె ప్రకటించారు.
పరిశ్రమల ఏర్పాటులో త్వరతగతిన అనుమతులిస్తామని.. 2018-23 పాలసీని మరింత మెరుగులుదిద్ది నూతన పాలసీని తెస్తామన్నారు. రాష్ట్రంలో 9 టెక్స్ టైల్, అపెరల్ పార్కులున్నాయని.. ఆరు ప్రభుత్వ రంగంలో ఉండగా, మూడు ప్రైవేటు రంగంలో ఉన్నాయని పేర్కొన్నారు. 146 మెగా టెక్స్ టైల్ ఇండస్ట్రీలు, 18,500 యూనిట్లు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15 టెక్నికల్ టెక్స్‌టైల్ కంపెనీల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, మూడు ఇండస్ట్రీస్ కారిడార్లు ఉన్నాయని మంత్రి సవిత చెప్పుకొచ్చారు.