Leading News Portal in Telugu

Pakistan: వరదలతో పాకిస్తాన్ అతలాకుతలం.. 209కి చేరిన మృతుల సంఖ్య..


  • పాకిస్తాన్‌ని ముంచెత్తున్న వరదలు..

  • సింధ్ ప్రావిన్సుల్లో విధ్వంసం..

  • రుతుపవన కాలంలో 209కి చేరిన మరణాల సంఖ్య..
Pakistan: వరదలతో పాకిస్తాన్ అతలాకుతలం.. 209కి చేరిన మృతుల సంఖ్య..

Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌ని భారీ వర్షాలు, మెరుపు వరదలు కలవరపెడుతున్నాయి. రుతుపవన వర్షాల కారణంగా సంభవిస్తున్న వరదలు దక్షిణ పాకిస్తాన్‌ని ముంచెత్తుతున్నాయి. జూలై 1 నుంచి వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 209కి పెరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లో గడిచిన 24 గంటల్లో 14 మంది మరణించారని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి ఇర్ఫాన్ అలీ తెలిపారు. ఇతర మరణాలు చాలా వరకు ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు సింధ్ ప్రావిన్సులలో సంభవించాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వారం భారీ వర్షాలు కురుస్తాయని పాక్ వాతావరణ శాఖ తెలిపింది.

పాక్‌లో వర్షాకాలం జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2022లో సంభవించిన భారీ వర్షాలు, వరదలు ఆ దేశంలోని మూడో వంతు భాగాన్ని ప్రభావితం చేశాయి. ఇప్పటికీ చాలా వరకు వ్యవసాయ భూముల్లో నీరు నిలిచే ఉంది. ఈ వర్షాల కారణంగా 2022లో 1,739 మంది మరణించారు. 30 బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది, ఫలితంగా పాకిస్తాన్ దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.