Leading News Portal in Telugu

East Godavari: వృద్ధుల ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు


  • తూ.గో జిల్లాలో వృద్ధులు ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా..

  • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన అనపర్తి పోలీసులు..

  • రూ. 9 లక్షల విలువైన సుమారు 273 గ్రాముల బంగారం స్వాధీనం..
East Godavari: వృద్ధుల ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధులు ఇళ్లను టార్గెట్ గా చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న రాజమండ్రి రూరల్ వేమగిరికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర, చక్ర జగదాంబలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి రూ. 9 లక్షల విలువైన సుమారు 273 గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేశారు. ఒంటరిగా ఉండే ముసలివాళ్ళు ఉంటున్న ఇల్లు చూసుకుని వారితో పరిచయం ఏర్పరచుకొని పని మనిషిగా వాళ్ళ ఇళ్లలో చేరడంతో పాటు నమ్మించి వారు స్పృహ కోల్పోయేలా చేసిన తరువాత వారి దగ్గర బంగారు వస్తువులను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, ఈ నేపథ్యంలోనే నిందితులు 10 కేసులలో జైలు శిక్ష అనుభవించి, 2021లో జైలు నుంచి విడుదలైన తర్వాత.. మళ్లీ 18కి పైగా దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. తూర్పు గోదావరిలోని అనపర్తి, బిక్కవోలు, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, ఉండ్రాజవరం, కాకినాడ, పెదపూడి, గండేపల్లి, కరప, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ ల పరిధిలోనూ అనేక చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని.. వీరి దగ్గర నుంచి సుమారు 273.8 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.