Leading News Portal in Telugu

Vijayawada: బెజవాడలో వైసీపీకి షాక్‌.. టీడీపీ గూటికి కార్పొరేటర్లు..


  • బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌..

  • టీడీపీ కండువా కప్పుకున్న ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు..

  • త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయంటున్న కేశినేని చిన్ని.. బోండా ఉమా..
Vijayawada: బెజవాడలో వైసీపీకి షాక్‌.. టీడీపీ గూటికి కార్పొరేటర్లు..

Vijayawada: బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.. ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో.. పలు మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది టీడీపీ కూటమి.. తాజాగా ఇప్పుడు బెజవాడలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది..

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. బెజవాడలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. నగర అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వస్తారో వారికి టీడీపీ అండగా ఉంటుందన్న ఆయన.. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి మళ్లీ ఇప్పుడు కొనసాగిస్తాం అన్నారు. ప్రతిపక్ష పార్టీని బెజవాడలో ఉండకుండా చేస్తాం.. బెజవాడను టీడీపీకి కంచు కోటగా మారుస్తాం అన్నారు ఎంపీ కేశినేని చిన్ని.. ఇక, ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు.. వైసీపీ విధానాలతో నష్టపోయారు.. జగన్ వల్ల బెజవాడలో అభివృద్ది కుంటుపడిందన్నారు. గెలిచిన వైసీపీ కార్పొరేటర్లకి అభివృద్ది పనులకు చిల్లి గవ్వ జగన్ ఇవ్వలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు బెజవాడలో ఉంటాయన్నారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.