తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్నబియ్యం! | minister uttam good news to white card holders| quality
posted on Aug 23, 2024 10:43AM
తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ కానున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. పౌరసరఫరాల శాఖకు పై మంత్రి గురువారం (ఆగస్టు 22) సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు నెరవేరేలా చూసేందుకు అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్‌షిప్ రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,629 రేషన్ డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలలో భోజనంలో నాణ్యత ఉండాలని.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలోనూ నాణ్యత పాటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.