posted on Aug 23, 2024 3:00PM
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. నిషేధంతో పాటు అనిల్ అంబానీకి పాతిక కోట్ల జరిమానా కూడా విధించింది. అంతే కాకుండా స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయిన ఏ కంపెనీలోనూ డెైరెక్టర్, కీ మేనేజిరియల్ పర్సనల్ సహా మరేఇతర పదవి చేపట్టకుండా ఆంక్షలు విధించింది. అలాగే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 6 నెలల పాటు తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీకి రూ. 6 లక్షల జరిమానా కూడా విధించింది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో పనిచేసే కీలక అధికారుల సహకారంలో అనిల్ అంబానీ అక్రమంగా నిధులను మళ్లించినట్లు సెబీ పేర్కొంది. ఈ నిధులను ఆయనకే చెందిన ఇతర కంపెనీలకు లోన్లుగా ఇచ్చినట్లు తెలిపింది. ఇలాంటి రుణాలను నిలిపివేయాలని, కార్పొరేట్ రుణాలను క్రమం తప్పకుండా సమీక్షించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అనిల్ అంబానీ ట్టించుకోలేదని సెబీ వెల్లడించింది.
రిలయన్స్ హైసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి మోసపూరితమైన విధానంలో రుణాలు తీసుకున్న లేదా లబ్ధి పొందిన 24 ఎంటిటీలపైనా నిషేధం విధిస్తున్నట్లు సెబీ పేర్కొంది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో పాటు సెబీ బ్యాన్ చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ యూనికార్న్ ఎంటర్ ప్రైజెస్ , రిలయన్స్ ఎక్స్చేంజ్ నెక్స్ట్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ , రిలయన్స్ క్లీన్ జెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్ కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కంపెనీలకు కూడా రూ. 25 కోట్ల చొప్పున జరిమానా విధించినట్లు సెబీ తెలిపింది.
2022 ఫిబ్రవరి లోనే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, అనిల్ అంబానీతో పాటు మరో ముగ్గురిపై సెక్యూరిటిస్ మార్కెట్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే.