- ప్రముఖ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు
-
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేసు నమోదు

బంగ్లాదేశ్‌లో కోటా ఉద్యమం సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంత మంది క్షతగాత్రులయ్యారు. ఇక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. అనంతరం నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే షేక్ హసీనా ప్రభుత్వం రద్దవడంతో ప్రముఖ క్రికెటర్ షకీబ్ అల్ హసన్‌ఎంపీ పదవిని కోల్పోయాడు. ఇటీవలే బంగ్లా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్‌కు తాజాగా గట్టి షాక్ తగిలింది. అతడిపై హత్య కేసు నమోదైనట్లు ఢాకా మీడియా కథనాలు వెల్లడించాయి.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో రూబెల్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్ ఇస్లామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా షేక్ హసీనా సహా 154 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇందులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. బంగ్లాదేశీ ప్రముఖ నటుడు ఫెర్దూస్ అహ్మద్‌ను కూడా ఇందులో 55వ నిందితుడిగా పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వీరిద్దరూ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె ప్రభుత్వం రద్దయ్యింది. దీంతో వీరు పదవిని కోల్పోయారు.