posted on Aug 24, 2024 2:17PM
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అక్టోబర్ 1వ తేదీన హర్యానాలోని 90 స్థానాల శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తథ్యమని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనీ, ఇక ప్రాంతీయపార్టీ అయిన జననాయక్ జనతా పార్టీ (జె.జె.పి) ఎప్పటి మాదిరిగానే తన మూడవ స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సారైనా హర్యానాలో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇండీ కూటమి భాగస్వామ్యపక్షంగా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి తీవ్రమైన యాంటీ ఇంకంబన్సీ ఎదుర్కొంటోందనీ, ఆ ప్రభుత్వ వ్యతిరేకతే తమకు అవకాశంగా మారుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అయితే బీజేపీ కూడా ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైనీని కూర్చోబెట్టింది. అలాగే పలు సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజాభిమానాన్ని పొందడంపై దృష్టి కేంద్రీకరించింది.
అదే విధంగా ప్రభుత్వంపై సర్పంచ్ ల అసంతృప్తిని తగ్గించి, వారి ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి చర్యలు చేపట్టింది. అందులో ప్రధానంగా సర్పంచ్ ల వ్యయపరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 21 లక్షల రూపాయలకు పెంచింది. ప్రజలలో అసంతృప్తిని తగ్గించేందుకు, ప్రభుత్వంపై అభిమానాన్ని పెంచి మద్దతు కూడగట్టేందుకు సమాధాన్ శిబిర్ లే ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నడుంబిగించింది. కాంట్రాక్టు ప్రాతిపదిన పనిచేస్తున్న సుమారు 1.20 లక్షల మంది ఉద్యోగులకు వారు పదవీ విరమణ చేసేవరకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సైనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఓబీసీలను క్రీమీలేయర్ గా ప్రకటిస్తూ ఖట్టర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, ఆ ఆదాయ పరిమితిని 8 లక్షలకు సైని సర్కార్ పెంచడం ద్వారా ఆదాయవర్గాలను సంతోషపెట్టింది. అగ్నివీర్ పథకం కింద పనిచేసిన సైనికులకు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతామని సైనీ ప్రభుత్వం వాగ్దానం చేసింది.
అయితే ఎన్ని చేసినా బీజేపీకి ఇబ్బందికలిగించే అంశాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ చట్టాలు, అగ్నివీర్ పథకం వంటివి అధికార బీజేపీ పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తికి కారణమయ్యాయి. అందుకే గత పదేళ్లుగా బీజేపీకి అనుకూలించిన జాట్, జాటేతరుల విభేదాలు ఈ సారి ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతుంటే.. అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్ లాంటి కాంగ్రెస్ మాత్రం అవి రచ్చకెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, పార్టీ ఐక్యంగా ఉందన్న సంకేతాలు ఇస్తోంది.
అన్నిటికీ మించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచార సారథి, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా వ్యవసాయ రంగాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తామని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చేసిన వాగ్దానం రైతులను, యువతకు కాంగ్రెస్ కు చేరువ చేసింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని 20 లోక్ సభ స్థానాలకు గాను పదింటిలో బీజేపీ విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ కు కూడా పది స్థానాలు దక్కాయి. అయితే లోక్ సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకూ చాలా తేడా ఉందనీ, పార్లమెంటు ఎన్నికలలో ఉన్న సానుకూలత, రాష్ట్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపికీ అసెంబ్లీ ఎన్నికలలో ఉండే అవకాశాలు తక్కువని పరిశీలకులు అంటున్నారు.