- ఎన్ కన్వెన్షన్ కూల్చేతలపై స్పందించిన హైడ్రా. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్‌లోని కట్టడాలను కూల్చివేశామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
- ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని వెల్లడి

HYDRA Commissioner: గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్‌లోని కట్టడాలను కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని.. హైకోర్టులో స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది పూర్తిగా అవాస్తవమన్నారు. ఎఫ్టీఎల్‌లో కట్టడాలు ఉన్నందునే కూల్చి వేయడం జరిగిందన్నారు. చెరువుని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారని.. చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి కట్టడాలను కూల్చివేసిందని ఆయన వెల్లడించారు. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని.. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్‌ను అధికారులు గతంలోనే తిరస్కరించారని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ పైన ఇప్పటికే లోకాయుక్తతో పాటు హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఎన్ కన్వెన్షన్‌లో పూర్తిగా అన్ని కట్టడాలను నేలమట్టం చేశామని.. ఎన్ కన్వెన్షన్ ప్రస్తుతం జీరోగా మారిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
ఇదెలా ఉండగా.. తమ్మిడికుంట చెరువు ఖానామెట్ గ్రామం, మాదాపూర్‌లోని ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తొలగించారని హైడ్రా ఓ ప్రకటనలో పేర్కొంది. తొలగించబడిన అనేక నిర్మాణాలలో ఎన్- కన్వెన్షన్ కూడా ఒకటని తెలిపింది. 2014లో హెచ్‌ఎండీఏ తమ్మిడికుంట సరస్సు ఎఫ్టీఎల , బఫర్ జోన్‌లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ విడుదలైంది. 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం పిటిషనర్ ఎన్ కన్వెన్షన్ సమక్షంలో ఎఫ్టీఎల్ సర్వే నిర్వహించబడింది
ఎన్- కన్వెన్షన్ పై 2017 నుండి కేసు పెండింగ్‌లో ఉంది. ఏ కోర్టు నుండి ఎటువంటి స్టే ఉత్తర్వులు లేవని హైడ్రా తెలిపింది. ఎన్- కన్వెన్షన్ ఎఫ్టీఎల్,బఫర్ జోన్‌లలో నిర్మించిన అనధికారిక నిర్మాణాల ద్వారా సిస్టమ్స్ & ప్రాసెస్‌ను స్పష్టంగా తారుమారు చేస్తోందని..వాణిజ్య కార్యకలాపాలను కొనసాగిస్తోందని హైడ్రా పేర్కొంది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ ఎన్-కన్వెన్షన్‌కు ఎటువంటి భవన నిర్మాణ అనుమతిని ఇవ్వలేదని స్పష్టం చేసింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (BRS) కింద అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించింది, కానీ సంబంధిత అధికారులచే తిరస్కరించబడిందని వెల్లడించింది.