- తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్ష
- అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
- బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు

Tirumala: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో శ్యామలారావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో గరుడసేవ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. బ్రహ్మోత్సవాల మొదటి రోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. రెండు లక్షల లడ్డూల బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయని టీటీడీ ఈవో తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఇంజనీరింగ్ పనులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. భక్తులను ఆకట్టుకోవడానికి విద్యుత్ అలంకరణ, వాహనసేవలు వీక్షించడానికి మాఢవీదుల్లో బిగ్ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో వసతి గదులు సిఫార్సు లేఖలు, దాతలకు కేటాయింపు రద్దు చేశామన్నారు. పారిశుద్ధ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు.
క్యూలైన్లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని ఈవో స్పష్టం చేశారు. మెడికల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, శ్రీవారి సేవకులను అదనంగా నియమిస్తామని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కళా బృందాలను ఏర్పాటు చేస్తున్నామని.. ఏడు రాష్ట్రాల నుండి కళాబృందాలు రానున్నాయన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది నీటి నిల్వలు తగ్గాయని.. 5770 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలు ప్రస్తుతం ఉన్నాయన్నారు. కళ్యాణ డ్యామ్‌లో కూడా నీటి నిల్వలు తగ్గాయన్నారు. రోజూ 11 లక్షల గ్యాలన్లు మున్సిపల్ కార్పొరేషన్ టీటీడీకి ఇవ్వడానికి అంగీకరించిందన్నారు. బ్రహ్మోత్సవాలకు నీటి సమస్య ఉండదని భావిస్తున్నామని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు.